కరోనా వైరస్ ప్రపంచాన్ని గజగజా వణికిస్తోంది. ఏదో ఒక రకంగా వైరస్ వల్ల ప్రపంచ వ్యాప్త ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. వైరస్ బారినుండి కోలుకునే వారి సంఖ్య ఎక్కువే ఉన్నా మరణాలు కూడా నమోదు అవుతుండడంతో భయానక పరిస్థితి ఏర్పడింది. ఇండియాలో రోజు రోజుకీ కోవిడ్ విజృంభణ పెరుగుతూనే ఉంది. అన్ లాక్ దశ మొదలయినప్పటి నుండి ఇంట్లో నుండి బయట అడుగు బయటపెట్టాలంటే భయపడుతున్నారు.
ఇప్పటికే చాలా మంది ఫిలిమ్ సెలెబ్రిటీలని తాకిన కరోనా, దిగ్గజ గాయకుడు బాలసుబ్రమణ్యానికి సోకింది. కొన్ని రోజుల క్రితం బాలసుబ్రమణ్యం ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించాడు. అయితే అప్పుడు తన ఆరోగ్యం బాగానే ఉందని, పెద్దగా దిగులు చెందాల్సిన అవసరం లేదని, ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఆస్పత్రిలో జాయిన్ అయ్యాయని చెప్పారు.
తాజాగా ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. దాంతో అభిమానులు ఆందోళనకి గురవుతున్నారు. ప్రస్తుతం ప్రత్యేక వైద్యబృందం చికిత్స అందిస్తున్నారు. దాదాపు అన్ని భారతీయ భాషల్లో పాటలు పాడి ఎనలేని కీర్తి సంపాదించుకున్న బాలసుబ్రమణ్యం త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా అభిమానులు పోస్టులు పెడుతున్నారు.