పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీమేక్ లపై ఆసక్తి కనబరుస్తున్నాడు. వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న పవన్, ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో సినిమాతో పాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమా ఒప్పుకున్న సంగతి తెలిసిందే. వకీల్ సాబ్ ఇంకా సెట్స్ పై ఉండగానే మరో చిత్రానికి సంతకం చేయబోతున్నాడని టాక్. అది కూడా మరో రీమేక్ అని అంటున్నారు. మలయాళ చిత్రమైన అయ్యప్పనుమ్ కోషియం సినిమా పవన్ కళ్యాణ్ కి బాగా నచ్చిందట.
పృథ్వీరాజ్, బిజూ మీనన్ ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్ర తెలుగు రీమేక్ హక్కులను కొనుక్కున్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఇందులో నటించే హీరోల కోసం వెతుకుతుంది. తాజాగా ఈ చిత్రాన్ని చూసిన పవన్ కళ్యాణ్ తాను చేస్తే బాగుంటుందని ఫీల్ అయ్యాడట. మరికొద్ది రోజుల్లో ఈ విషయమై అధికారిక సమాచారం వెల్లడి అవుతుందని చెబుతున్నారు.
అయితే ఈ సినిమాలో మరో ప్రధాన పాత్రలో తమిళ నటుడు విజయ్ సేతుపతి నటించనున్నాడట. తొలిప్రేమ, మిస్టర్ మజ్ను చిత్రాల దర్శకుడు వెంకీ అట్లూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడట. ప్రస్తుతం వెంకీ అట్లూరి నితిన్ తో రంగ్ దే సినిమా చేస్తున్నాడు. ఇద్దరి పాత్రల అహం వల్ల పరిస్థితులు ఎలా మారాయన్న ఉద్దేశంతో తెరకెక్కిన అయ్యప్పనుమ్ కోషియం వంటి మాస్ చిత్రంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడంటే అభిమానులకి పండగే..