తెలుగు సినిమా ఇండస్ట్రీలో విలన్ గా వచ్చి హీరోగా సక్సెస్ అయ్యి దూసుకుపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే కమెడియన్ నుండి హీరో అయిన వాళ్ళు ఎంతో మంది. వేణు మాధవ్, ఆలీ, సునీల్, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి మొదలగు వారందరూ కమెడియన్ గానే కాకుండా హీరోగానూ సినిమాలు చేస్తూ వచ్చారు. తాజాగా మరో టాలెంటెడ్ కమెడియన్ హీరోగా మారుతున్నాడు.
మత్తు వదలరా సినిమాలో తనదైన కామెడీతో నవ్వులు పూయించిన సత్య హీరోగా సినిమా చేస్తున్నాడట. హీరో సందీప్ కిషన్ నిర్మాతగా వ్యవహరిస్తున్న వివాహ భోజనంబు చిత్రంలో హీరోగా సత్య కనిపిస్తున్నాడని అంటున్నారు. ఇటీవల ఈ చిత్ర ప్రీ లుక్ విడుదలైంది. అందులో హీరోని కనిపించకుండా చేసారు. టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్న నటుడు ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడని సందీప్ కిషన్ చెప్పిన సంగతి తెలిసిందే.
దాంతో ఆ టాలెంటెడ్ యాక్టర్ సత్య అయ్యుంటాడని చెప్పుకుంటున్నారు. ఇప్పటి వరకూ తన కామెడీతో ప్రేక్షకులని అలరించిన సత్య, వివాహ భోజనంబు సినిమాతో హీరోగానూ వినోదం పంచుతాడట. మరి అందరూ అనుకుంటున్నట్టు ఆ హీరో సత్యనేనా లేదా అనేది చూడాలి.