ఒకప్పటి టాప్ హీరోయిన్.. ప్రస్తుతం అమ్మ కేరెక్టర్స్ కి కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తున్న చేప కళ్ళ మీనా ఇప్పుడు కొత్త పాత్రలని కోరుకుంటుంది. టాప్ హీరోయిన్‌గా చిరు, వెంకీ, బాలకృష్ణ, మోహన్ బాబు వంటి సీనియర్ స్టార్ హీరోలందరితో నటించిన మీనా ఇప్పుడు హీరోలకి తల్లి పాత్రలు చేస్తుంది. సాక్ష్యం సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చిన్నప్పటి పాత్రకి తల్లిగా కొద్దినిమిషాలు కనిపించిన మీనాకి ఇప్పుడు ఓ కొత్త కోరిక కలిగింది. తన ఫ్యామిలీతో గడుపుతూనే కూతురి కోసం ఎక్కువ సమయం కేటాయిస్తున్నా అని చెబుతున్న మీనాకి తన కూతురే సర్వస్వం అంటోంది.
అయితే అలాంటి కూతుర్ని వదిలి సెట్స్ మీదకి రావాలంటే తనకి వచ్చిన పాత్ర చాలా పవర్ ఫుల్ ది అయ్యి ఉండాలట. అది ఎలాంటి పాత్ర అని అడిగితే.. దానికి మీనా ఏం చెప్పింది అంటే తాను సినిమా ఒప్పుకుంటే ఆ పాత్రకి ప్రథమ ప్రాముఖ్యత ఉండాలి.. అప్పుడే సినిమా ఒప్పుకుంటాను. మరీ ముఖ్యంగా నెగెటివ్ షేడ్స్ ఉన్న విలన్ క్యారెక్టర్ దొరికితే మాత్రం వదులుకోకుండా చేయాలని ఉంది అంటూ చెబుతుంది. అంటే మీనాకి విలన్ పాత్రల మీద మనసు మళ్లింది అన్నమాట. మరి ఎప్పుడూ క్యూట్ గా.. అందమైన కళ్ళతో ఊరించే మీనా.. నెగెటివ్ షేడ్స్ ఉన్న కేరెక్టర్ చేస్తే ఆమె అభిమానుల రియాక్షన్ ఎలా ఉంటుందో కదా..