లెజండరీ సింగర్ ఎస్పీ బాల సుబ్రమణ్యం కరోనా మహమ్మారి నుంచి కోలుకుంటున్నారు. ఇంకా ఐసీయూలోనే బాలు చికిత్స తీసుకుంటున్నారు. ఆయన ఆరోగ్యానికి సంబంధించి కుటుంబ సభ్యులు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు. అయితే తాజాగా ఎస్పీబీకి సంబంధించిన ఓ విషయం నెట్టింట్లో.. తమిళ వెబ్ సైట్స్, టీవీ చానెల్స్‌లో తెగ వైరల్ అవుతోంది. ఇది ఎంతవరకు నిజమనేది ఇంకా కుటుంబ సభ్యులు ధృవీకరించలేదు. ఇంతకీ అదేమిటంటే.. ఆస్పత్రిలోనే బాలు తన 51వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. శనివారం సాయంత్రం వైద్యుల సమక్షంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ బాలు-సావిత్రి దంపతులు పెళ్లి రోజును జరుపుకున్నారని తెలియవచ్చింది. డాక్టర్ల సలహా మేరకు ఐసీయూలోనే కేక్ కట్ చేశారని తమిళ మీడియాతో పాటు నెట్టింట్లో వార్తలు వైరల్ అవుతున్నాయి.
శుభవార్త ఏంటో..!?
అయితే.. ఇటీవలే ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ అభిమానులు ఆశీస్సులు, ప్రార్థనలు ఫలిస్తున్నాయని.. నాన్నగారు కోలుకుంటున్నారని వీడియోలో తెలిపారు. దీంతో ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని.. వార్షికోత్సవం కూడా జరుపుకున్నారని అభిమానులు అనుకుంటున్నారు. ఇందులో నిజానిజాలెంత అనేది తెలియరాలేదు. దీనిపై ఇంతవరకూ ఆస్పత్రి వర్గాలు కానీ, చరణ్ కానీ స్పందించలేదు. ఇందుకు సంబంధించి ప్రకటన వస్తే మాత్రం ఈ రూమర్స్‌కు చెక్ పడే అవకాశముంది. ఇవన్నీ అటుంచితే.. సోమవారం రోజున ఓ శుభవార్త వినబోతున్నారని చరణ్ ఇదివరకే చెప్పారు. అయితే ఆ శుభవార్త ఇదేనని.. పెళ్లిరోజున కేక్ కట్ చేసిన ఫొటోలను కూడా విడుదల చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఒక వేళ ఇది కాకుంటే మరేదైనా చెబుతారా..? అని అభిమానులు ఎంతగానో వేచి చూస్తున్నారు. కాగా.. గత నెల 5న చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చేరిన ఎస్పీబీ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.