నీది నాది ఒకే కథ సినిమాతో దర్శకుడిగా తన కంటూ మంచి పేరు తెచ్చుకున్న వేణు ఊడుగుల, ప్రస్తుతం రానా దగ్గుబాటితో విరాట పర్వం అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. సాయిపల్లవి హీరోయిన్ గా రూపొందుతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. కరోనా కారణంగా ఈ చిత్ర షూటింగ్ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఐతే గత కొన్ని రోజులుగా వేణు ఊడుగుల నిర్మాతగా మారబోతున్నాడని, ఆహా కోసం వెబ్ సిరీస్ నిర్మించే పనిలో ఉన్నాడని అంటున్నారు. విభిన్నమైన కథాంశంతో సినిమా తీసి సక్సెస్ అందుకున్న దర్శకుడు చలం కథతో వెబ్ సిరీస్ తీస్తున్నాడని వార్తలు వచ్చాయి.
ఈ మేరకు ఇప్పటి వరకు అధికారిక సమాచారం బయటకి రానప్పటికీ, తాజాగా ఈ వెబ్ సిరీస్ గురించి ఒకానొక వార్త ఫిలిమ్ నగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. దర్శకుడు రూపొందిస్తున్న వెబ్ సిరీస్ లో కమెడియన్ రాహుల్ రామక్రిష్ణ హీరోగా కనిపించనున్నాడట. వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్రధారిగా నటించనున్నాడని వినిపిస్తుంది. అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన కమెడియన్ హీరోగా మారుతున్నాడన్నమాట. మరి దీనిపై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.