సినిమా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వార్త రానే వచ్చింది. అన్ లాక్ 5.0లో భాగంగా థియేటర్లు తెరుచుకోవచ్చునని అనుమతులు జారీ చేసింది. కరోనా కారణంగా మార్చిలో మూతబడిన థియేటర్లు సుమారు ఏడు నెలల తర్వాత తెరుచుకోనున్నాయి. అన్ లాక్ 4.0 ముగిసిన తర్వాత అన్ లాక్ 5.0 అక్టోబర్ 1వ తేదీ నుండి అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో సినిమా హాళ్లతో పాటి స్విమ్మింగ్ ఫూల్స్, పార్కులకి అనుమతులు ఇచ్చారు.
ఐతే థియేటర్ల అనుమతికి షరతులతో కూడిన నిబంధనలు పెట్టారు. సీటింగ్ కెపాసిటీలో సగం సీట్ల వరకే ప్రేక్షకులని అనుమతించాలట. అంటే ఒక థియేటర్లో వెయ్యి సీట్లు ఉంటే ఐదు వందల మంది మాత్రమే సినిమా చూడవచ్చు. అక్టోబర్ 15వ తేదీ నుండి థియేటర్లు తెరుచుకోనున్నాయి. కరోనా నిబంధనలని పాటిస్తూ ప్రేక్షకులకి ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా ఉండాలని తెలిపింది.
ఇప్పటి వరకు ఓటీటీలో రిలీజైన సినిమాలని చిన్న తెరలో చూసినవాళ్ళు వెండితెరకి సిద్ధం కావాల్సిందే. మరి థియేటర్లు తెరుచుకుంటున్న వేళ రిలీజ్ అయ్యే మొదటి సినిమా ఏమై ఉంటుందో చూడాలి.