గత కొన్ని రోజులుగా బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్, రోజూ వార్తల్లో నిలుస్తూ ఉంది. సుశాంత్ సింగ్ మరణం తర్వాత శివసేనతో గొడవ, ముంబైలో తన ఆఫీసు భవనం కూల్చివేత మొదలగు అంశాలతో రోజూ వివాదాల్లో నిలుస్తూ వస్తుంది. ఐతే ప్రస్తుతం కంగనా రనౌత్ బ్యాక్ టు వర్క్ అంటుంది. కరోనా కారణంగా నిలిచిపోయిన తలైవి చిత్రీకరణని మళ్లీ రీస్టార్ట్ చేయడానికి కంగనా రనౌత్ చెన్నై చేరుకుంది.
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న తలైవి సినిమాలో కంగనా రనౌత్ జయలలిత పాత్రలో కనిపిస్తుంది. ఇప్పటికే ఫస్ట్ లుక్, సెకండ్ లుక్ కూడా రిలీజైంది. ఏ ఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తమిళంతో పాటు హిందీ తెలుగు భాషల్లోనూ రిలీజ్ అవుతుంది. తలైవి సినిమాలో ఎంజీఆర్ గా అరవింద్ స్వామి కనిపించనుండగా శశికళ గా పూర్ణ నటిస్తుంది. సీనియర్ నటి మధుబాల మరో కీలక పాత్రలో కనిపించనుంది. విష్ణు ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.