గత కొన్ని రోజులుగా తెలుగు సినిమా షూటింగులన్నీ మొదలవుతున్నాయి. కరోనా కారణంగా నిలిచిపోయిన షూటింగులన్నీ మరింత వేగంతో స్టార్ట్ అవుతున్నాయి. ప్రభుత్వం సూచించిన అన్ని నియమాల ప్రకారం చిత్రీకరణ మొదలు పెట్టడానికి చిత్ర నిర్మాతలు, హీరోలు ముందుకు వస్తున్నారు. తాజాగా నేచురల్ స్టార్ నాని, టక్ జగదీష్ చిత్ర షూటింగ్ మొదలెట్టాడు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా నాని ప్రకటించాడు.
జగదీష్ జాయిన్ అయ్యాడు. టక్ మొదలైందని చెబుతూ టక్ జగదీష్ షూటింగ్ పునఃప్రారంభిస్తున్నానని తన ముఖం కనబడకుండా టక్ వేసుకుని నిలబడిన ఫోటో ఒకటి పెట్టాడు. చేతిలో మాస్కు కనిపిస్తుంది. రాత్రివేళల్లో షూటింగ్ చేస్తున్నారేమో, లైట్ వెలుతురులో పంటపొలాలు దర్శనమిస్తున్నాయి.
రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. నిన్ను కోరి సినిమాతో నానికి మంచి హిట్ ఇచ్చిన శివ నిర్వాణతో తెర్కెక్కుతున్న రెండవ చిత్రం టక్ జగదీష్ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.