రావాలి జగన్.. కావాలి జగన్ అనే స్లోగన్ తో ముఖ్యమంత్రి అయిన జగన్.. అదిగో ఆంధ్ర అభివృద్ధి, ఇదిగో ఆంధ్ర అభివృద్ధి అన్న మాటే కానీ.. ఎక్కడా ఆచరణలో పెట్టింది లేదు. చిన్న పిల్లలు స్కూల్ లో గొడవ పడిన మాదిరిగా స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో జగన్ ప్రభుత్వం vs ఎన్నికల కమిషన్ అన్నట్టుగా ఉంది ఆంధ్ర రాజకీయం. మరోపక్క రాజధానుల గోల. మూడు రాజధానులు అంటూ జగన్ ప్రభుత్వం ప్రకటించడంతో అమరావతి ఉద్యమం మొదలైంది. అదిగో ప్రభుత్వం ఇలా చేస్తుంది అంటూ ప్రతిపక్షాలు నోరు విప్పితే వారి మీద కేసులు, జైలు ఇది వైసిపి ప్రభుత్వం వచ్చినప్పటినుండి ఆంధ్రలో జరుగుతున్న అభివృద్ధి. మధ్యలో మాట్లాడితే రౌడీ మంత్రి గారు అదేనండి కొడాలి నాని బూతులతో రెచ్చిపొతూ జగన్ ని కాపాడుకుంటాడు.
అయితే ఆంధ్ర లో వైసిపి ప్రభుత్వం మొదలైన ఆరు నెలలకే ఆంధ్ర రోడ్లన్ని ఆస్తవ్యస్తం అనగా.. మనుషుల నడుము విరిగి నరకానికి కేరాఫ్ అడ్రెస్ లుగా మారిన రోడ్లు చూస్తేనే భయం వేసేలా తయారయ్యాయి. రోడ్డు మీద బండి తియ్యాలన్నా, కారు కదపాలన్నా నడుములు విరగ్గొట్టుకుని హాస్పిటల్ కి వెళ్లే మాదిరి ఏపీ రోడ్లు తయారయ్యాయి. కొన్ని ఏరియాలలో అంటే జంగారెడ్డి గూడెం, కొయ్యల గూడెం, కొవ్వూరు రహదారిలో ప్రయాణించామంటే నరకానికి డైరెక్ట్ టికెట్ అన్నమాట. ప్రతి పక్షాలు ఎంతలా గొంతు చించుకున్నా ప్రభుత్వానికి రోడ్ల విషయంలో చీమ కొట్టినట్టుగా కూడా లేదు. ఎమన్నా అంటే గత ప్రభుత్వం పెట్టిన బకాయిల వలనే రోడ్లకి ఫండ్స్ శాంక్షన్ అవడం లేదంటూ గత ప్రభుత్వంపై నెపం నెట్టెయ్యడం. ఇంకా మాట్లాడితే భారీ వర్షాలు పడ్డాయి, అందుకే రోడ్లు అలా అయ్యాయి అంటారు. వర్షాకాలం పోయి నాలుగు నెలలైనా ఏపీ రోడ్లు ఇంకా అలానే ఉన్నాయి.
కానీ ఇప్పుడు రోడ్ల కి వైసిపి ప్రభుత్వం కష్టపడి ఫండ్స్ రిలీజ్ చేస్తుందట. రోడ్ల అభివృద్ధికి వైసిపి ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ వేసింది అంటూ మంత్రి శంకర్ నారాయణ గారు చెబుతున్నారు. 46 వేల కిలోమీటర్ల రోడ్లకు మహర్దశ కలగనుంది అంటూ.. ఇకపై ఏపీ రోడ్లన్నీ జిగేల్ మంటూ అద్దాల్లా మెరిసిపోతాయంటూ స్టేట్మెంట్స్ ఇచ్చేస్తున్నారు ఏపీ మంత్రి గారు. 6 వేల కోట్లు రోడ్ల అభివృద్ధికి కేటాయించినట్లుగా మంత్రి శంకర్ నారాయణ చెబుతున్నారు. మరి రోడ్డెక్కి నడుం విరగ్గొట్టుకుని కట్టు కట్టించుకున్నాక రోడ్లు బాగుచేయిస్తే ఏం ఉపయోగం మంత్రి గారు అంటున్నారు ఏపీ ప్రజలు.