నిన్న తిరుపతి పర్యటనలో పవన్ కళ్యాణ్ జనసేన కార్యకర్త వెంగయ్య.. వైసిపి ఎమ్యెల్యే, వైసిపి కార్యకర్తల వలన ఆత్మహత్య చేసుకున్నాడంటూ ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లారు . అంతేకాకుండా వెంగయ్య కుటుంబానికి పవన్ కళ్యాణ్ 8.50 లక్షల ఆర్ధిక సహాయం కూడా చేసారు. అయితే వెంగయ్య చనిపోవడానికి కారణం అన్నా రాంబాబు, అతని తమ్ముడే కారణం అంటూ అన్నా రాంబాబుపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చెయ్యడమే కాదు.. జనసేన కార్యకర్తలపై దాడులు చేస్తే ఊరుకోమని.. అన్నీ ఎదుర్కొంటామని, ఎన్ని కోట్లు ఖర్చయినా అన్నా రాంబాబు వచ్చే ఎన్నికల్లోగా అసెంబ్లీకి వెళ్లకుండా చూస్తానంటూ.. ఇది అన్నా రాంబాబు పతనానికి నాంది అంటూ పవన్ కళ్యాణ్ అన్నా రాంబాబుపై నిప్పులు చెరిగారు.
అయితే పవన్ కళ్యాణ్ మాటలకు ఇప్పుడు వైసిపి ఎమ్యెల్యే ఓపెన్ ఛాలెంజ్ చేసాడు. రాంబాబు ప్రెస్ మీట్ పెట్టి మీరు పోలీస్ ద్వారా తెలుసుకుంటారా? తెలుసుకోండి. లేదంటే ఓ కమిటీ వేసి ఎంక్వైరీ వేసుకోండి. మీ కార్యకర్త చనిపోవడం వెనుక మా కార్యకర్తలు ఉన్నారని కానీ, మా ప్రమేయం ఏదైనా ఉంది అనుకుంటే మేము కోర్టులో లొంగిపోతాం. మీరు చెప్పండి ప్రమేయం ఉంది అని, మీరు నిజాయితీగా చెప్పండి మేము వెళ్లి కోర్టులో లొంగిపోతాం. లేదా నేను మా ముఖ్యమంత్రి గారికి ఎలాగోలా చెప్పుకుని ఒప్పించి నా శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తాను. రండి ఇక్కడ నా మీద నిలబడి పోటీ చెయ్యండి. ఎందుకంటే మేము ఎలాంటి వాళ్ళమో ఇక్కడ జనాలకు తెలుసు. నిజంగా తప్పు చేస్తే వాళ్ళు మమ్మల్ని ఓడిస్తారు కదా. వచ్చి ముందు గెలిచి చూపించండి. అప్పుడయినా ఓకె. మేము వెళ్లి కోర్టులో లొంగిపోతాము. మీరు కనీసం గెలిచి చూపించండి. లేదు ఓడిపోయినా పక్షంలో మీ జనసేన పార్టీని మూసుకుని వెళ్లి సినిమాలు చేసుకోండి అంటూ పవన్ కళ్యాణ్ కి అన్నా రాంబాబుకి ఓపెన్ ఛాలెంజ్ విసిరారు.