మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఎన్ని మరపురాని మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చారో మనందరికీ తెలుసు. దాదాపు దశాబ్దంన్నర పాటు ఆయన పాటలు దద్దరిల్లిపోయాయి. చిరు, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి నాటి అగ్ర హీరోలకే కాక అప్పటి అప్ కమింగ్ స్టార్స్ అయిన పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వంటి హీరోలకీ పెద్ద పెద్ద మ్యూజికల్ హిట్స్ ఇచ్చి వాళ్ళ కెరీర్ టర్నింగ్ పాయింట్ మూవీస్ కి తన వంతు దోహదపడ్డారు మణిశర్మ. అయితే ఆపై మారిన ట్రెండ్ వల్లనూ, కొత్త నీరు రాకడతోనూ నెమ్మదించిపోయిన మణిశర్మ ఈమధ్య వచ్చిన ఇస్మార్ట్ శంకర్ తో చాలా స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చారు. మాంచి మాస్ మసాలా సాంగ్స్ తో మోత మోగించేసారు.
దాంతో మణిశర్మ లో ఇంకా పస తగ్గలేదని గుర్తించిన పరిశ్రమ మణిని మళ్ళీ వరుస అవకాశాలతో పలకరించింది. మెగాస్టార్ట్ ఆచార్య, వెంకటేష్ నారప్ప వంటి పెద్ద సినిమాలతోనే కాక ఇంకా పలు ప్రాజెక్ట్స్ తో ఇపుడు చాలా బిజీ గా ఉన్నారు మణి శర్మ. అయితే మణిశర్మ మనసుని ఓ విషయంలో నారప్ప యూనిట్ నొప్పించింది అని వాపోతున్నారు ఆయన. ఇంతకీ విషయం ఏమిటంటే... ఇటీవల ఓ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మణిశర్మ మాట్లాడుతూ చాలా గ్యాప్ తరువాత చిరు సినిమా కి వర్క్ చేయడం చాలా హ్యాపీ గా ఉందని, ఆచార్య అద్భుతంగా వస్తోందని ఆనందంగా చెప్పిన మణి.. నారప్ప యూనిట్ మాత్రం తన పని తనను చెయ్యనివ్వడం లేదంటూ కంప్లైంట్ చేసారు. ఆ మధ్య వెంకీ బర్తడే సందర్భంగా విడుదలైన నారప్ప సినిమా మోషన్ పోస్టర్ కి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మణి చేసింది కాదట. ఆ పోస్టర్ మేటర్ తన నోటీసు కి తీసుకు రాకుండానే వాళ్ళే ఎదో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో రిలీజ్ చేసేయ్యగా.. అది కాస్తా కాపీ ట్యూన్ అంటూ నెగటివ్ కామెంట్స్ అఫీషియల్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన తనపై వచ్చాయని నొచ్చుకున్నారు మణి శర్మ. మరి అంతటి సీనియర్ టెక్నీషియన్ విషయం లో అలా వ్యవహరించడం ఎంత వరకూ కరెక్టో నువ్వే రియలైజ్ అవ్వాలప్పా నారప్పా..!