దర్శక బాహుబలి ఎస్ ఎస్ రాజమౌళి రూపొందిస్తోన్న ప్రెస్టీజియస్ ఫిలిం RRR లో తారక్ - చరణ్ ల పోటా పోటీ నటనను చూసేందుకై అటు అభిమానులు ఇటు ప్రేక్షకులు అంతా తహతహలాడుతున్నారు. అక్టోబర్ 13 న RRR ని థియేటర్స్ లోకి దింపుతానంటూ ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్ లాక్ చేసిన రాజమౌళి ఆ దిశగా పనులన్నీ వేగవంతం చేసారు. అయితే అక్కడ జక్కన్న RRR ని చెక్కే వర్క్ లో బిజీ బిజీగా ఉంటే ఆయన హీరోలు ఇద్దరూ మాత్రం ఈ రోజు బయటి కార్యక్రమాల్లో ప్రత్యక్షమై సందడి చేయడం విశేషం.
నేటి ఉదయం సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన వార్షిక సదస్సుకి ముఖ్య అతిధిగా హాజరైన జూ.ఎన్ఠీఆర్ కొత్త పెట్రోలింగ్ వాహనాలను జెండా ఊపి ప్రారంభించడంతో పాటు తన ప్రసంగంలో దయచేసి అందరూ నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలంటూ విజ్ఞప్తి చేసారు.
ఇక రామ్ చరణ్ విషయానికి వస్తే.. ప్రస్తుతం మారేడుమిల్లి ఫారెస్ట్ లో ఆచార్య షూటింగ్ చేస్తోన్న చరణ్ రాజమండ్రిలో జరిగిన ఉప్పెన విజయోత్సవానికి ఛీఫ్ గెస్ట్ గా వెళ్లి తన కజిన్ వైష్ణవ్ తేజ్ కి తొలి చిత్రంతోనే పెద్ద విజయం దక్కినందుకు ఆనందం వ్యక్తం చేసాడు.
ఇలా మొత్తానికి ఉదయం కొమురం భీమ్ దర్శనం జరిగితే సాయంత్రానికి సీతారామరాజుని చూసే ఛాన్స్ దొరికింది సినీ అభిమానులకి. మరి వీళ్లిద్దరు అలా విడివిడిగా కనిపిస్తేనే ఇలా ఉందంటే... రేపు RRR లో కలిసి కనిపించి మెరిపించే మెరుపులకి థియేటర్స్ దద్దరిల్లడం ఖాయమేగా..!