కోలీవుడ్ లో ఇండియన్ 2 విషయం హై కోర్టు మెట్లు ఎక్కింది. దర్శకుడు శంకర్ ఇండియన్ 2 షూటింగ్ వదిలేసి వేరే ప్రాజెక్ట్స్ కి సైన్ చేస్తున్నారని ఇండియన్ 2 నిర్మాతలు లైకా ప్రొడక్షన్ వారు కోర్టుకి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే శంకర్ మరో 20 శాతం షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది.. దాన్ని పూర్తి చేశాకే వేరే సినిమాలు చేస్తానని కోర్టుకి చెప్పి తమ వాదన వినిపించారు శంకర్ తరుపు న్యాయవాది. కోర్టు ఇరువురి వాదనలు విన్న తర్వాత ఈ విషయం కోర్టు పరిష్కరించడం కన్నా మీరే కూర్చుని మాట్లాడుకోండి అంటూ తీర్పునిచ్చింది. మరి గతంలో ఇండియన్ 2 సినిమా షూటింగ్ ఆగిపోయినప్పుడే కమల్ హాసన్ అటు శంకర్ కి ఇటు లైకా ప్రొడక్షన్స్ కి మధ్య సంధి చెయ్యడానికి చాలా ట్రై చేసారు.
కానీ శంకర్ వినలేదు, ఇటు లైకా వారు వినలేదు. దానితో ఇండియన్ 2 షూటింగ్ ఆగిపోయింది. ఇప్పుడు మాత్రం శంకర్ - లైకా ప్రొడక్షన్ వారు కూర్చుని మాట్లాడుకున్నారంటే సమస్య పరిష్కారం అవుతుందా? శంకర్ ఇండియన్ 2 పూర్తి చెయ్యడానికి రెడీ అయ్యారు. కానీ లైకా వారు మళ్ళీ బడ్జెట్ పెట్టి మిగతా సినిమా చెయ్యాలి. ఇప్పుడు నిర్మాతలే ఓ అడుగు ముందుకు వేసి శంకర్ తో పని పూర్తి చేయించుకోవాలి. ఇప్పటికే తడిచి మోపెడయిన బడ్జెట్ చూసిన లైకా వారు ఇంకా బడ్జెట్ పెట్టడానికి సిద్ధపడాలి. మరి ఇప్పుడు లైకాప్రొడక్షన్ తీసుకునే నిర్ణయంపై ఇండియన్ 2 మూవీ షూటింగ్ మొదలవుతుంది.