ఎట్టకేలకి తెలంగాణ ప్రభుత్వం రేపటినుండి ఓ పది రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. కేవలం ఆరు నుండి 10 గంటల వరకు మాత్రమే నిత్యావరసరాల కొనుగోలు, ఇతర కార్యకలాపాలు కొనసాగించే వెసులుబాటు కల్పించిన తెలంగాణ గవర్నమెంట్ మిగతా 20 గంటలు లాక్ డౌన్ లోనే ఉండాలని ప్రకటించింది. అయితే తెలంగాణాలో లాక్ డౌన్ విధించిన కేసీఆర్.. కొన్ని మార్గదర్శకాలను కూడా విడుదల చేసారు. అందులో భాగంగా అత్యవసర సేవలతో పాటు, వ్యవసాయ రంగానికి, అలాగే ఫార్మా కంపెనీలు, వైద్య పరికరాల తయారీ సంస్థలు, మెడికల్ డిస్ట్రిబ్యూటర్లు, మెడికల్ షాపుల కార్యకలాపాలకు అనుమతి.
ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల సేవలకు ఎలాంటి ఆటంకాలు ఉండవు. మీడియాకి ఎలాంటి లాక్ డౌన్ వర్తించదు. విద్యుత్ రంగానికి, వంట గ్యాస్ ఫిల్లింగ్ కేంద్రాలు ఎలాంటి ఆంక్షలు వర్తించవు అని, ఇక పెళ్ళిళ్ళకి కేవలం 40 మంది, అంత్యక్రియలకు 20 మందికి మాత్రమే అనుమతులని ఇచ్చింది తెలంగాణ గవర్నమెంట్. ప్రజలు మూడు కిలోమీటర్ల పరిధిలోనే కార్యకలాపాలను ముగించుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులని సీఎం ఆదేశించారు.