యంగ్ స్టార్ నవీన్ పోలిశెట్టి తన అభిమానులకు అండగా నిలుస్తున్నారు. తన మాటలతో వారికి ఓదార్పునిస్తున్నారు. కరోనా కారణంగా కుటుంబ సభ్యులను, సన్నిహితులను కోల్పోయిన అభిమానులతో వీడియో కాల్ లో మాట్లాడుతున్నారు. వారికి ధైర్యం చెబుతున్నారు. ఈ కష్టకాలంలో వారికి కావాల్సిన మానసిక స్థైర్యాన్ని అందిస్తున్నారు.
ఇటీవల సాయి స్మరణ్ అనే నవీన్ పోలిశెట్టి అభిమాని తండ్రి కరోనాతో కన్నుమూశారు. సాయి స్మరణ్ తల్లి ఈ బాధతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. ఆమె మనసు వేరే పనుల మీదకు మరల్చేందుకు జాతిరత్నాలు సినిమాను తల్లికి చూపించాడు సాయి స్మరణ్. ఆ సినిమా చూస్తూ మనసు తేలిక చేసుకుందా తల్లి. ఈ విషయాన్ని నవీన్ పోలిశెట్టికి ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు సాయి స్మరణ్. నవీన్ పోలిశెట్టి వెంటనే మదర్ తో ఫోన్ లో మాట్లాడి ఓదార్చారు. ప్రియమైన వారిని కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుందో తను ఊహించగలనని, ఇలాంటి కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని చెప్పారు.
కరోనా కష్టాల్లో ఉన్న వారితో మాట్లాడి, మానసిక స్థైర్యాన్ని ఇవ్వాలని ఈ సందర్భంగా నవీన్ పోలిశెట్టి అందరికీ విజ్ఞప్తి చేశారు.