జయలలిత మరణాంతరం తమిళనాడు రాజకీయాలను ఓ కుదుపు కుదిపిన శశికళ.. ముఖ్యమంత్రి అయిపోదామనుకున్న టైం లో ఆమెని అక్రమాస్తుల కేసులో అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపడంతో పళని స్వామీ సీఎం గా కంటిన్యూ అయ్యారు. ఆ తర్వాత శశికళ మార్క్ రాజకీయం తమిళనాడు పాలిటిక్స్ లో కనిపించలేదు. మరోసారి అసంబ్లీ ఎన్నికల ముందు శశికళ జైలు నుండి విడుదలై రాజకీయాలను శాసిస్తుంది అనుకుంటే.. గప్ చుప్ గా రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్టుగా చెప్పి చిన్నపాటి షాకిచ్చింది. అన్నాడీఎంకే పగ్గాలు చేపట్టి అధ్యక్షురాలిగా పార్టీలో చక్రం తిప్పుతుంది అనుకుంటే శశికళ మనసు మార్చుకుని రాజకీయాలను దూరం పెట్టింది.
కానీ ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓడిపోవడం, ఆ పార్టీ చెల్లాచెదురు అయ్యిపోతుంది అన్న కారణముగా శశికళ మళ్ళీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా కోలీవుడ్ మీడియాలో టాక్. మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చేందుకు శశికళ పావులు కదుపుతుంది అని, ఇప్పటికే మద్దతుదారులకు ఫోన్ లు చేస్తూ శశికళ రాజకీయాలు మొదలు పెట్టింది అని తెలుస్తుంది. అన్నాడీఎంకే అంతర్గత కుమ్ములాటలతో పార్టీ నాశనం అవుతూ ఉంటే చూస్తూ కూర్చోలేనని, తానొచ్చి పార్టీని గాడిలో పెడతానని మద్దతుదారులతో చెప్పినట్టు సమాచారం. నేనున్నా అంటూ పార్టీ కార్యకర్తల్లో ధైర్యం నింపేందుకు శశికళ బయలు దేరినట్టుగా తెలుస్తుంది.