కోవిడ్ సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడం, పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ అంశాల సడలింపుతో సినిమా ఇండస్ట్రీ కదిలింది. పలు సినిమాల షూటింగ్ షెడ్యూల్ తో ఇండస్ట్రీ లో కళ మొదలైంది. తమిళ, తెలుగు, హిందీ, అన్ని భాషల సినిమా ఇండస్ట్రీలు తమ తమ సినిమా షూటింగ్స్ మొదలుపెట్టేస్తున్నాయి. ఇక తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ తన కొత్త సినిమా నాట్ ఏ కామన్ మ్యాన్ షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో మొదలైన విషయం తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే రీసెంట్ గా ఆ సినిమా యాక్షన్ సీన్ చిత్రీకరణలో భాగంగా విశాల్ కి పెను ప్రమాదమే తప్పింది.
విశాల్ ఆ ఫైట్ సీన్ లో డూప్ లేకుండా నటిస్తుండడం, విలన్స్ తో తలపడే ప్రాసెస్ లో విశాల్ వెనుక భాగం ఓ సీసా బలంగా తాకడంతో.. విశాల్ కి గాయాలేమైనా అయ్యాయేమో అనే భయంలో చిత్ర బృందం కంగారు పడింది. కానీ విశాల్ కి పెద్దగా గాయాలు కాకపోవడంతో ఊపిరి తీసుకుంది. ఆ ఇన్సిడెంట్ జరిగాక కూడా విశాల్ ఎలాంటి బ్రేక్ తీసుకోకుండా ఆ యాక్షన్ సన్నివేశాలను కంప్లీట్ చెయ్యడం అందరికి షాకిచ్చింది. ఈ ఇన్సిడెంట్ పై విశాల్ స్పందిస్తూ.. తృటిలో ప్రమాదం తప్పింది అని, ఈ విషయంలో ఫైటర్ తప్పేమీలేదని, కాకపోతే కొంచెం టైమింగ్ తప్పింది అని, యాక్షన్ సీన్స్ విషయాల్లో ఇలాంటివి సర్వసాధారణంగా జరుగుతుంటాయని.. తనకి ప్రమాదం తప్పడం నిజంగా దేవుడు దయ అని, అందరి ఆశీస్సులతో తాను మళ్ళీ షూటింగ్ లో యధావిధిగా పాల్గొంటున్నట్టుగా చెప్పాడు.