మా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడకుండానే మా ఎలక్షన్ వేడి రాజుకుంది. నిన్న ప్రకాష్ రాజ్ ప్యానల్ ప్రెస్ మీట్ పెట్టారు. ఇక నేడు జీవిత తో కలిసి సీనియర్ నరేష్ పెట్టిన ప్రెస్ మీట్ తో ఆ వేడి మరింత రాజుకుంది. నాలుగేళ్లుగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ప్రతిష్ఠ మసకబారిందని నాగబాబు చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం మా అధ్యక్షుడు నరేశ్ మండిపడ్డారు. మాలో టాలీవుడ్‌లో నటించిన ఎవరైనా సరే మా అధ్యక్ష పదవికి పోటీ చేయొచ్చని తెలిపారు. మాలో రాజకీయ ఇష్యూలు తలెత్తుతున్నాయని చెప్పారు. తన గురించి తాను చెప్పుకునే అవసరం లేదని నరేశ్ అన్నారు.
సినీ పరిశ్రమకు ఎలాంటి సమస్య వచ్చినా తాను, తన కుటుంబం సాయం చేస్తున్నామని తెలిపారు. మా లోని సభ్యులను తాను కలుపుకుపోలేదని కొందరు చేస్తోన్న విమర్శలు సరికాదని చెప్పారు. నిన్న ఒక మీడియా సమావేశం జరిగిందని, అందులో కొందరు పలు వ్యాఖ్యలు చేశారని నరేశ్ అన్నారు. మూడు నెలల క్రితమే ప్రకాశ్ రాజ్ తనకు ఫోన్ చేసి, తాను మా ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నట్లు చెప్పారని తెలిపారు. ఎవరైనా పోటీ చేయొచ్చని తాను చెప్పానని అన్నారు. మంచు విష్ణు కూడా తనతో మాట్లాడారని తెలిపారు. ఎవరైనా సరే ఈ ఎన్నికల్లో పోటీ చేయొచ్చని తెలిపారు. మా అనేది ఒక రాజకీయ వ్యవస్థ కాదని నరేశ్ అన్నారు.
లోకల్.. నాన్ లోకల్ అనే వ్యాఖ్యలు తాము చేయలేదని ఆయన చెప్పారు. నాగబాబు తనకు మంచి మిత్రుడని, ఆయన అంటే తనకు గౌరవం ఉందని చెప్పారు. మా ప్రతిష్ఠ మసకబారిందని ఆయన అనడం మాత్రం సరికాదని చెప్పారు. మా కోసం తాము చాలా కష్టపడ్డామని తెలిపారు. ఆయన మాటలు తమను బాధపెట్టాయన్నారు. ఆయన మాటలు విని షాక్ అయ్యామని తెలిపారు. తాము మా లో అందరం కలిసి పని చేస్తున్నామని నరేశ్ చెప్పారు. సంస్థను కించపర్చడమనేది సరికాదని చెప్పారు. మా మసకబారిపోయిందా? ముందు అడుగు వేస్తుందా? అన్న విషయంపై తాము నిన్న జీవితారాజశేఖర్ తో కలిసి చర్చించామని తెలిపారు.