ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్స్ విషయంలో తీసుకున్న నిర్ణయంతో.. సినిమా పరిశ్రమ ఏకీభవించడం లేదు. ఇప్పటివరకు పెద్ద నిర్మాతలు గప్ చుప్ గా వున్నారు.. నిన్న అసెంబ్లీలో సినిమా టికెట్ రేట్స్ విషయంలో చట్టం చేయడంపై సినిమా ఇండస్ట్రీ నుండి ఒక్కరూ నోరు మెదపడం లేదు. అసలు ఎవరు ముందు స్పందిస్తారా అని ఎదురు చూస్తున్నట్లుగా ఉంది వ్యవహారం. ప్రస్తుతం ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా మారిన చిరంజీవి.. ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ రేట్స్ విషయాన్ని పునః పరిశీలించాలని ఏపీ సీఎం జగన్ కి చిరు విన్నపం చేసుకున్నారు.
చిరంజీవి సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ.. సినిమా ఇండస్ట్రీ కోరినట్టుగానే ఆన్‌లైన్ టిక్కెటింగ్ బిల్ అసెంబ్లీలో ప్రవేశ పెట్టడం ఆనందించదగ్గ విషయం. అదేవిధంగా సినిమా థియేటర్ల మనుగడ, సినిమానే ఆధారంగా చేసుకున్న ఎన్నో కుటుంబాల బతుకు తెరువు కోసం టికెట్ ధరలను కాలానుగుణంగా పెంచాల్సి ఉంటుంది. దేశంలోని అన్ని రాష్ట్రాల మాదిరిగానే నిర్ణయిస్తే సినిమా ఇండస్ట్రీకి మేలు జరుగుతుంది. దేశమంతా ఒకటే జీఎస్టీగా పన్నులు వసూలు చేస్తున్నప్పుడు సినిమా టికెట్ రేట్స్ విషయంలోనూ అదే వెసులుబాటు ఉండటం సమంజసం. దయచేసి ఈ విషయంపై మరోమారు పునరాలోచించండి. ఆ ప్రోత్సాహం ఉన్నప్పుడే టాలీవుడ్ ఇండస్ట్రీ నిలదొక్కుకోగలుగుతుంది.. అంటూ జగన్ కి చిరు విన్నపం చేసారు మెగాస్టార్.