అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో పాన్ ఇండియా స్టయిల్లో తెరకెక్కిన సినిమా పుష్ప ది రైజ్. డిసెంబర్ 17న ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రానికి కలెక్షన్స్ అదిరిపోతున్నాయి. ఇప్పటికే 2021 ఇండియన్ బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచిన పుష్ప.. కొత్త ఏడాది కూడా అదే జోరు చూపిస్తుంది. విడుదలైన 16వ రోజు హిందీలో రికార్డు వసూళ్లు సాధించింది. ఏకంగా 6 కోట్లకు పైగా వసూలు చేసి ఔరా అనిపించింది. మొదటి రోజు వచ్చిన వసూళ్ల కంటే కూడా ఇది చాలా ఎక్కువ. అంతేకాదు హిందీలో పుష్ప సినిమాకు హైయ్యస్ట్ సింగిల్ డే కలెక్షన్ కూడా ఇదే. ఇప్పటికే బాలీవుడ్‌లో అంచనాలకు మించి రాణిస్తుంది పుష్ప సినిమా. అక్కడ ఈ సినిమాకు 56 కోట్లు వచ్చాయి. 75 కోట్ల దిశగా వేగంగా దూసుకుపోతుంది పుష్ప. ఇదే విషయాన్ని బాలీవుడ్ ట్రేడ్ పండితుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేసారు. కరోనా సెకండ్ వేవ్ ముగిసిన తర్వాత అత్యధిక వసూళ్లు తీసుకొచ్చిన ఇండియన్ సినిమాగా నిలిచింది పుష్ప.
ఇప్పటికీ కొన్నిచోట్ల ఈ చిత్రానికి హౌజ్ ఫుల్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఓవరాల్‌గా ఇప్పటికే పుష్ప సినిమాకు 300 కోట్ల గ్రాస్ వచ్చింది. అల్లు అర్జున్ మాస్ స్టామినాకు ఇది నిదర్శనం. ఆయన పర్ఫార్మెన్స్‌కు అంతా ఫిదా అయిపోతున్నారు. పుష్ప సినిమాను కేవలం అల్లు అర్జున్ కోసమే చూడొచ్చు అనేలా థియేటర్స్‌కు క్యూ కడుతున్నారు ఆడియన్స్. కేవలం తెలుగులోనే కాకుండా మిగిలిన రాష్ట్రాల్లోనూ అద్భుతాలు చేసింది పుష్ప.. ఇంకా చేస్తూనే ఉంది కూడా. కేవలం తమిళం, హిందీలోనే పుష్ప సినిమాకు 80 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. అల్లు అర్జున్ ఐకానిక్ ఇమేజ్‌కు ఇది నిదర్శనంగా నిలుస్తుంది. ఫుల్ రన్‌లో సినిమా 350 కోట్ల వరకు వసూలు చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో సునీల్, అనసూయ, జగదీష్ ప్రతాప్ భండారీ కీలక పాత్రల్లో నటించారు. మైత్రి మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా పుష్ప సినిమాను నిర్మించారు.