ఫైనల్ గా గుడ్ లక్ సఖి టీమ్ కి ఒక గుడ్ న్యూస్ వచ్చిందని చెప్పాలి. చిరంజీవి ఛీఫ్ గెస్ట్ గా ప్లాన్ చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ చిరుకి సోకినా కరోనా వల్ల అయోమయంలో పడింది. అయితే ఒకసారి మాట ఇచ్చాక ఏదో విధంగా దాన్ని నెరేవేర్చే తీరడం మెగాస్టార్ నైజం అనేది అందరికీ తెలిసిందే. తాను హోమ్ ఐసోలేషన్ లో ఉన్నప్పటికీ... తన తరపున తనయుడు రామ్ చరణ్ గుడ్ లక్ సఖి ఈవెంట్ కి హాజరయ్యేలా ఆదేశించారు చిరు. ఎప్పుడూ తండ్రి మాటను తూచా తప్పక పాటించే చరణ్ వెంటనే తాను ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి వస్తున్నాను అంటూ గుడ్ లక్ సఖి టీమ్ కి కన్ఫర్మేషన్ ఇచ్చేసారు.
ఇంకేముంది.. ఆఘమేఘాల మీద క్రొత్త డిజైన్స్ రెడీ అయ్యాయి. మీడియా వాళ్లకి మెసేజులు వెళ్లాయి. కార్యక్రమ ఏర్పాట్లు జోరందుకున్నాయి. మెగాస్టార్ రాలేని లోటు లోటే అయినా... మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రాక ఈ వేడుక వేల్యూని కాపాడినట్టే అవుతుంది. ప్రస్తుతం సర్కారు వారి పాటలో మహేష్ సరసన నటిస్తోన్న కీర్తి సురేష్ ఇప్పటివరకు రామ్ చరణ్ తో జోడీ కట్టలేదు. అయితే ఈ రోజు ఈ వేదికపై రామ్ చరణ్ - కీర్తి సురేష్ ల కాంబోని చూడొచ్చు కనుకే ఆ ఎలిమెంటే ఈ ఈవెంట్ కి స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది అనడంలో సందేహం లేదు.