ఓ హీరో - డైరెక్టర్ కలయికలో హిట్ సినిమాలు పడినప్పుడు, వారిద్దరికీ మధ్య మంచి ట్యూనింగ్ ఉన్నప్పుడు ఆ కాంబో రిపీట్ కావడం అనేది కామనే అన్నిచోట్లా. అయితే అది తరచుగా జరగొచ్చేమో కానీ వరసగా మాత్రం కాదు. కానీ తమిళ హీరో అజిత్ అదో టైప్.
రజనీ-కమల్ దగ్గర్నుంచీ విజయ్, విక్రమ్, సూర్య వంటి తన సాటి హీరోలందరూ ఎప్పటికప్పుడు వేర్వేరు దర్శకులతో పని చేస్తుంటే అజిత్ మాత్రం ఒకే దర్శకుడితో ఓ మూడ్నాలుగు సినిమాలు లాగించేస్తూ ఉంటారు. ఆమధ్య శివ అనే డైరెక్టర్ తో వీరం, వేదాళం, వివేకం, విశ్వాసం పేర్లతో ఏకధాటిగా నాలుగు చిత్రాలు చేసేసిన అజిత్ ఇపుడు హెచ్.వినోద్ అనే డైరెక్టర్ కి మళ్ళీ అలాంటి అవకాశం ఇచ్చేసారు.
నెర్కొండపార్వయ్ అనే సినిమాతో అజిత్-వినోద్ ల జోడీ తొలిసారి కలిసింది. అంతే.. వెంటనే అదే వినోద్ కి మరో ఛాన్స్ ఇస్తూ వలిమై అనే మూవీ కూడా చేసారు అజిత్. ఆ వలిమై చిత్రం ఈ ఫిబ్రవరి 24 న విడుదల కానుండగా అంతలోనే మూడో మూవీకి కూడా అజిత్ ఓకే చెప్పేసారు.. రామోజీ ఫిలింసిటీలో షూటింగ్ సైతం మొదలుపెట్టేస్తున్నారు.
అజిత్ వంటి హీరో ఇలా వేగంగా సినిమాలు చెయ్యడం ఇండస్ట్రీకి, ఫ్యాన్సుకి ఆనందాన్ని కలిగించే విషయమే. కానీ హీరోగారూ ఆ అలవాటు మార్చుకోరా, వేరియస్ డైరెక్టర్స్ తో వర్క్ చేస్తే వెరైటీ సినిమాలు వస్తాయి కదా, ఎంతో క్రేజ్ ఉన్న అజిత్ లాంటి స్టార్ అందరు దర్శకులకూ అవకాశం ఇవ్వాలి కదా అనే వాదన బలంగా వినిపిస్తోంది తమిళ సినీ పరిశ్రమలో. మరది అజిత్ చెవిని కూడా చేరిందేమో... తన తదుపరి చిత్రాన్ని ఆకాశం నీ హద్దురా ఫేమ్ సుధా కొంగర దర్శకత్వంలో చేసేందుకు అంగీకరించారట..!