ఓటీటీ పుణ్యమా అని భాషాభేదం తొలిగిపోయింది. ప్రాంతాల హద్దు చెరిగిపోయింది. రానున్న అన్ని చిత్రాలపై ఓ కన్నేసే ఉంచుతున్నారు ఆడియన్స్. ప్రత్యేకించి దక్షిణాది చిత్రాలపై కాస్త ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు ఫిల్మ్ లవర్స్. ఈ నేపథ్యంలో త్వరలో రానున్న రెండూ చిత్రాలు కొన్ని అంశాల్లో సిమిలర్ గా అనిపిస్తూ.. దేనికదే కలర్ ఫుల్ గా కనిపిస్తూ అందర్నీ ఆకర్షిస్తున్నాయి. అవేంటో.. వాటి ఎట్రాక్టివ్ ఎలిమెంట్స్ ఏంటో ఓసారి చూద్దాం.
ఓకే బంగారం, మహానటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకూ చేరువైన దుల్కర్ సాల్మన్ మార్చి 5 న హేయ్ సినామిక అననున్నాడు. ఉప్పెన వంటి తన అభినయ ప్రతిభతో అందర్నీ ఆకట్టుకునే విజయ్ సేతుపతి ఏప్రిల్ 28 న కాతువాకుల రెండు కాదల్ అనే విభిన్న కథని చూపనున్నాడు. నటనలో ఇద్దరూ ఇద్దరే. ఎవరి విలక్షణత వారిదే. ఇక కథానాయికల విషయానికి వస్తే దుల్కర్ సరసన కాజల్ అగర్వాల్, అదితిరావు హైదరీ కనిపిస్తోంటే.. విజయ్ సేతుపతితో నయనతార, సమంత కలిసొస్తున్నారు. ఆ ఇద్దరైనా ఈ ఇద్దరైనా ఎవరికి వారు క్రేజ్ ఉన్న భామలే. అందం అభినయం రెండూ ఉన్న టాప్ హీరోయిన్లే. అలాగే ఈ సినిమాల డైరెక్టర్స్ కీ ఓ ప్రత్యేకత ఉంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ బృంద హేయ్ సినామిక తో దర్శకురాలిగా మారుతుంటే.. త్వరలోనే తాను పెళ్లాడనున్న నయనతారను డైరెక్ట్ చేస్తూ ఆ సినిమా తీసాడు తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్.
మొత్తానికి ప్రేమ, పెళ్లి, స్నేహం అనే అంశాలతో హేయ్ సినామిక - ఏకకాలంలో ఇద్దరు అమ్మాయిలని ప్రేమించే వ్యక్తి కథగా కాతువాకుల రెండు కాదల్ చిత్రాలు ప్రామిసింగ్ ఫిలిమ్స్ గా అంతటా మంచి అటెన్షన్ రాబట్టుకుంటున్నాయి. ముఖ్యంగా క్యాస్టింగే ఈ రెండు సినిమాలకీ మెయిన్ ఎట్రాక్షన్ గా మారిందని చెప్పాలి. ఫైనల్ గా వీక్షకులను ఏ మేరకు ఇంప్రెస్ చేస్తారనేది చూడాలి.!