కింగ్ నాగార్జున హైదరాబాద్ శివారు చెంగిచర్ల అటవీ బ్లాక్ పరిధిలో తన తండ్రి, దివంగత ప్రఖ్యాత నటుడు అక్కినేని నాగేశ్వర రావు పేరు మీద అర్బన్ ఫారెస్ట్ పార్కు ఏర్పాటు కు ముందుకు వచ్చారు. ఎం.పీ జోగినపల్లి సంతోష్ కుమార్ తో కలిసి చెంగిచర్లలో అక్కినేని నాగేశ్వర రావు అర్బన్ ఫారెస్ట్ పార్కు శంకుస్థాపన కార్యక్రమంలో నాగార్జున కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. అక్కినేని నాగార్జున, అమల, కుమారులు నాగ చైతన్య, అఖిల్ తో పాటు ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు. అటవీ పార్కు అభివృద్దికి ముఖ్యమంత్రి సంకల్పించిన హరిత నిధి (గ్రీన్ ఫండ్) ద్వారా రెండు కోట్ల రూపాయల చెక్ కు అటవీ శాఖ ఉన్నతాధికారులకు అందించారు.
మన పరిసరాలు, రాష్ట్రం, దేశం కూడా ఆకుపచ్చగా, పర్యావరణ హితంగా మారాలన్న సంకల్పంతో, తెలంగాణకు హరితహారం స్ఫూర్తితో ఎం.పీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రారంభించారని, ఈ కార్యక్రమంలో తాను స్వయంగా పాల్గొని పలు సార్లు మొక్కలు నాటానాని నాగార్జున తెలిపారు. గత బిగ్ బాస్ సీజన్ ఫైనల్ కార్యక్రమం సందర్భంగా అడవి దత్తతపై సంతోష్ గారితో చర్చించానని, ఆ రోజు వేదికపై ప్రకటించినట్లు గానే ఇప్పుడు అటవీ పునరుద్దరణ, అర్బన్ ఫారెస్ట్ పార్కు ఏర్పాటుకు శంకుస్థాపన చేయటం ఆనందంగా ఉందని నాగార్జున అన్నారు. ఈ అటవీ ప్రాంతం చుట్టూ ఉన్న పట్టణ ప్రాంత కాలనీ వాసులకు పార్కు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.
హైదరాబాద్- వరంగల్ జాతీయ రహదారి ఉప్పల్- మేడిపల్లి ప్రాంతంలో చెంగిచెర్ల ఫారెస్ట్ బ్లాక్ ఉంది. చుట్టూ విపరీతంగా జరిగిన పట్టణీకరణ మధ్య ఈ 1682 ఎకరాల అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. ఇందులో నాగార్జున వేయి ఎకరాలను దత్తత తీసుకున్నారు. నగర వాసులకు ఆహ్లాదం, ఆరోగ్యాన్ని పంచేలా కొద్ది ప్రాంతంలో అర్బన్ పార్కును అభివృద్ది చేసి, మిగతా ప్రాంతంలో అటవీ పునరుద్దరణ పనులు చేయనున్నారు. మేడిపల్లి నుంచి చెంగిచర్ల, చర్లపల్లి, ఈసీఐఎల్ ప్రాంతాలు, కాలనీ వాసులకు ఈ పార్కు ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు