జనవరి 29 న తన తల్లి అంజనాదేవికి జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ కోవిడ్ కారణంగా స్వయంగా కలవలేని స్థితిలో భావోద్వేగభరితమైన ట్వీట్ చేసారు చిరంజీవి. ఇక నేడు చరణ్ వంతు వచ్చింది. తనకీ అటువంటి పరిస్థితే ఎదురైంది.
ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో RC 15 షూట్ లో బిజీగా ఉన్న చరణ్ నేడు పుట్టినరోజు జరుపుకుంటోన్న తన తల్లి సురేఖకి ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. నీలా నన్నెవరూ అర్ధం చేసుకోలేరు అనే మీనింగ్ వచ్చేలా అమ్మపై అనురాగాన్ని వ్యక్తం చేస్తూ ఆచార్య షూటింగులో తన తల్లిదండ్రులతో కలిసి వున్న ఓ ఫాబ్యులస్ ఫొటోగ్రాఫ్ ని షేర్ చేసారు చరణ్.
ఇక అమ్మకి చరణ్ ఇస్తోన్న బహుమతి ఏమిటీ అంటే... ఆచార్య. యస్.. రామ్ చరణ్ తన తల్లికి ఇవ్వనున్న కానుక ఆచార్య సినిమానే. గతంలో మగధీరలో ఓ సీన్ లోను, ఖైదీ 150 లో ఓ పాటలోనూ తళుక్కున మెరిసిన ఆ తండ్రీ కొడుకుల కలయికని ఒక్క మూవీలో అయినా ఫుల్ ప్లెడ్జెడ్ గా చూడాలన్నది సురేఖ కోరికే అంటూ గతంలో చిరంజీవే చెప్పారు. అమ్మ ఆశని నిజం చెయ్యాలనుకున్న చరణ్ కి ఆచార్య కథ రూపంలో ఆ అవకాశం దొరికింది. అంతే.. ఆ చిత్ర నిర్మాణానికీ, అందులో నటించడానికి సిద్ధపడ్డ చరణ్ అన్నీ అనుకూలంగా ఉండి ఉంటే ఇప్పటికే ఆ సినిమాని రిలీజ్ చేసి తల్లి కళ్ళల్లో కాంతులు చూసేవాడు. బట్.. రావడం కాస్త లేట్ అయిందేమో కానీ ఆ మెగా మూవీ ఎప్పుడొచ్చినా సంచలనమే అన్నది పక్కా. సురేఖమ్మతో పాటు అందరికీ కన్నుల పండుగే ఎంచక్కా..!