ఇప్పుడు సౌత్ సినిమాలు హిందీ బాక్సాఫీసుని గజగజ వణికిస్తున్నాయి. బాలీవుడ్ లో గత కొన్నాళ్లుగా సరైన హిట్ సినిమా పడలేదు. ఈలోపు సౌత్ నుండి పాన్ ఇండియా మూవీస్ హిందీలో పై చెయ్యి సాధించడంతో అక్కడి మీడియా తో పాటుగా హీరోలు, బాలీవుడ్ ప్రముఖులు కుత కుత ఉడికిపోతున్నారు. కడుపుమంట ఆపుకోలేని కొందరు సౌత్ మూవీస్ పై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటు సౌత్ స్టార్ హీరోలు బాలీవుడ్ పై పంజా విసరడాన్ని అక్కడి మీడియా కూడా చూడలేకపోతుంది. అవకాశం ఉన్నప్పుడు ఆ సినిమాలపై విషం కక్కుతూనే ఉంది. కెజిఎఫ్ చాప్టర్ 2 కి కొన్ని వెబ్ సైట్స్ దారుణమైన రేటింగ్స్ ఇవ్వడం, బాలీవుడ్ మీడియా కూడా ఆ సినిమాపై నెగెటివిటి చూపించింది.
ఇక ఇప్పుడు మహేష్ బాబు నేను హిందీ సినిమాలు చెయ్యను, నాకు తెలుగులో నటించడం అంటేనే ఇష్టం, ఎలాగూ సౌత్ మూవీస్ హిందీలో ఆడుతున్నప్పుడు హిందీ లో స్ట్రయిట్ మూవీస్ చెయ్యడం అవసరం లేదు అన్నారు, అంతేకాకుండా నన్ను తట్టుకోవడం హిందీ వాళ్ళకి కష్టం అన్నారో లేదో.. అదిగో మహేష్ బాబు పారితోషకం ఎక్కువ, అందుకే హిందీ నిర్మాతలు తట్టుకోలేరని అన్నారు. అలాగే హిందీ అంటే మహేష్ కి ఇష్టం లేదు, ఓ సౌత్ హీరో హిందీ పై ఇలాంటి కామెంట్స్ చేస్తారా? సౌత్ మూవీస్ ని హిందీ ఆదరిస్తుంటే.. మహేష్ హిందీ మూవీస్ పై అలాంటి కామెంట్స్ చెయ్యడం ఏమిటి అంటూ బాలీవుడ్ మీడియాలో మహేష్ పై రకరకాల న్యూస్ లు స్ప్రెడ్ అయ్యాయి.
కానీ మహేష్ నేను సౌత్ మూవీస్ లో నటించడం అంటే ఇష్టం అన్నా కానీ, హిందీని తక్కువ చెయ్యలేదు అంటూ క్లారిటీ కూడా ఇచ్చారు. అయితే సౌత్ మీద కక్ష తీర్చుకోవడానికి బాలీవుడ్ మీడియా కి ఓ సందు దొరికింది అందుకే ఇలా అంటున్నారు విశ్లేషకులు.