నయనతార - విగ్నేష్ శివన్ లు పెళ్లి చేసుకుని జంటగా ఈ రోజు తిరుమల తిరుపతి కి వచ్చి శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనానంతరం నయనతార - విగ్నేష్ దంపతులకి పూజారులు తీర్ధ ప్రసాదాలు ఇవ్వగా.. అనంతరం నయన్ - విగ్నేష్ లు గుడి బయటకి వచ్చి మాడ వీధుల్లో ఫోటో షూట్ చేయించుకున్నారు. ఇదంతా వింతేమీ కాదు, ఏ సెలెబ్రిటీ అయినా కనిపించగానే ఫోటో గ్రాఫర్స్, మీడియా వాళ్ళు వాళ్ళ దగ్గరకు వెళ్లి ఫొటోస్ తీసి వైరల్ చెయ్యడం కామన్. అయితే నయనతార ఆ ఫోటో షూట్ కోసం చెప్పులు వేసుకుని పవిత్రమైన మాడ వీధుల్లోకి రావడమే అపచారం అంటున్నారు.
నయనతార చెప్పులు వేసుకుని ఫోటో షూట్ చేయించుకోవడం పై టీటీడీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. తిరుపతిలోని పవిత్ర స్థలమైన మాఢవీధుల్లో నయనతార వాళ్ళు ఇలా చెప్పులు వేసుకుని రావడం దురదృష్టకరమని, నయనతార ఫోటో షూట్ పై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని, ఏ ఏ సెక్షన్స్ కింద చర్యలు తీసుకోవచ్చో ఆలోచిస్తున్నామని టీటీడీ అధికారులు చెబుతున్నారు. ఏది ఏమైనా పవిత్రమైన గుడిలో పాదరక్షలతో అపవిత్రం చేయడంపై టీటీడీ భక్తులు కూడా నయనతార దంపతులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.