మంచు హీరోలైన మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు మనోజ్ లు ఈ రోజు తిరుపతిలో పాద యాత్ర చేస్తూ కోర్టుకి రావడం మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. 2019 లో ఫీజ్ రీ ఇంబర్సెమెంట్ కోసం చేసిన ధర్నా.. ఇప్పుడు వాళ్ళని కోర్టు చుట్టూ తిరిగేలా చేసింది. సార్వత్రిక ఎన్నికల కోడ్ ఉల్లంఘన కారణంగా మోహన్ బాబు నిర్వహిస్తున్న శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థలపై, మోహన్ బాబు ఆయన కుమారులు మంచు విష్ణు, మంచు మనోజ్ లపై కేసు నమోదు అయ్యింది. ఎటువంటి అనుమతులు లేకుండా రోడ్డు మీద ప్రజలకు అవాంతరాలు కలిగిస్తూ ధర్నా చెయ్యడంతో అప్పట్లో చంద్రగిరి పోలీస్ లు కేసు నమోదు చెయ్యగా.. ఈరోజు హియరింగ్ కి రావడంతో మోహన్ బాబు ఆయన కుమారులు కొద్ది దూరం కారులో కొద్ది పాదయాత్ర చేస్తూ వెళ్లి కోర్టుకి హాజరయ్యారు.
కోర్టు నుండి బయటికి వచ్చిన మోహన్ బాబు స్పష్టత లేని వివరణ ఇచ్చారు. కోర్టుకి పిలిచారు వచ్చాము. అలాగే పేపర్ కూడా ఇచ్చారు. నేను సంతకం కూడా పెట్టడం జరిగింది. దానితో ఈ కేసు వాయిదా వేశారు. కేసు వాయిదా పడింది అని చెప్పడంతో నేను బయటకు వచ్చేసాను. అయితే నేను ఇప్పుడు ఏం మాట్లాడినా కూడా అది కాంట్రవర్సీ అవుతుంది. అసలు నాకు ఎలాంటి సమన్లు కూడా అందలేదు. న్యాయమూర్తి రమ్మని పిలిస్తే నేను వచ్చాను. సమన్లపై సంతకం కూడా పెట్టాను. ఇంతకంటే ఈ విషయం గురించి తను ఏమి మాట్లాడలేను అంటూ ఏదేదో చెప్పి వెళ్లిపోయారు ఆయన.