‘‘పవన్ కల్యాణ్ సీఎం అవుతాడా? లేదా? అనేది చెప్పలేను కానీ.. ఆయన పట్టుదల చూస్తుంటే ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఉన్నత స్థానానికి వెళతాడని మాత్రం చెప్పగలను. పవన్ కల్యాణ్ సీఏం అయితే నేను గర్విస్తాను’’ అని అన్నారు సీనియర్ నటుడు మురళీమోహన్. ఇప్పుడాయన చేసిన వ్యాఖ్యలు సోషల్ ఇండియాలో వైరల్ అవుతున్నాయి. అందుక్కారణం ఆయన సీనియర్ నటుడే కాకుండా టీడీపీ వ్యక్తి కావడమే. తెలుగు దేశం పార్టీలో కీలకమైన వ్యక్తిగా బాధ్యతలు నిర్వర్తించిన మురళీమోహన్ తన తాజా ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్ గురించి ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘ఇప్పుడొస్తున్న రాజకీయ నాయకులు.. పూర్తి స్థాయిలో ఆ జర్నీని కొనసాగించడం కష్టం. మధ్యలోనే ఆ జర్నీని వదిలేస్తున్నారు. కానీ కొంతకాలంగా పవన్ కల్యాణ్‌ని చూస్తున్నాను. అతను మధ్యలో వదిలి వెళ్లిపోయే వ్యక్తి అయితే కాదు. మొండిగా పట్టుదలతో వెళుతున్నాడు. అతనిలో నాకు నచ్చే అంశం అదే. ప్రజలని, పార్టీని నమ్మి పవన్ కల్యాణ్ అడుగు వేస్తున్నాడు. తన పార్టీ కార్యకర్తలు ఆయనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు వెళుతున్నాడు. ఇదే విధంగా పవన్ కల్యాణ్ అడుగులు వేస్తే మాత్రం ఏదో ఒకరోజు ఖచ్చితంగా తను అనుకున్న ఉన్నత స్థానానికి చేరుకుంటాడు. పవన్ కల్యాణ్‌తో నాకంత పరిచయం లేదు కానీ.. చిరంజీవితో మాత్రం చాలా క్లోజ్‌నెస్ ఉంది. పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడా? లేదా? అనేది చెప్పలేను కానీ.. అతను సీఎం అయితే మాత్రం ఖచ్చితంగా గర్విస్తాను. ఎందుకంటే మా సినిమా ఇండస్ట్రీ నుండి ఎన్టీఆర్‌గారి తర్వాత మరొకరు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారని చాలా సంతోషిస్తాను..’’ అని మురళీమోహన్ ఈ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యల్ని పవన్ కల్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.