పవర్ స్టార్ పవన్ కల్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘గబ్బర్‌సింగ్’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎటువంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో.. ఎన్నో పరాజయాల తర్వాత పవన్ కల్యాణ్‌కు హిట్ వచ్చింది. అందుకే పవన్ కల్యాణ్ కెరీర్‌లో ఈ చిత్రం ఓ స్పెషల్ చిత్రంగా నిలిచిపోయింది. పవన్ కల్యాణ్ నటించిన టాప్ చిత్రాలలో ఒకటిగా ఈ చిత్రం నిలబడిపోయింది. అలాగే పవన్ కల్యాణ్‌కి వీరాభిమాని అయిన హరీష్ శంకర్.. ఈ సినిమాకి దర్శకుడు. ఒక అభిమాని.. తన అభిమాన హీరోని డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో? ఎలాంటి రిజల్ట్ వస్తుందో? ‘గబ్బర్ సింగ్’ చిత్రంతో హరీష్ నిరూపించాడు. అప్పటి నుండి ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్ అయితే బాగుండు అని మెగాభిమానులు ఎంతగానో కోరుకుంటున్నారు. వారి కోరికలు ఫలించి.. మళ్లీ ఈ బ్లాక్‌బస్టర్ కాంబినేషన్‌లో ‘భవదీయుడు భగత్‌సింగ్’ అనే సినిమా ప్రకటన వచ్చేసింది. ఫ్యాన్స్ అంతా హ్యాపీ. అయితే ప్రకటన అయితే వచ్చింది కానీ.. ఈ సినిమా ఇప్పుడప్పుడే సెట్స్‌పైకి వెళ్లే మార్గాలు మాత్రం కనిపించడం లేదు.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. పవర్ స్టార్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కించాల్సిన ఈ చిత్రం ప్రస్తుతానికి వాయిదా పడిందని తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ కల్యాణ్ పొలిటికల్ కమిట్‌మెంట్స్ కారణంగా.. ఈ సినిమాని పక్కన పెట్టేశారని.. మళ్లీ ఈ సినిమా తెరపైకి రావాలంటే కనీసం 2 సంవత్సరాల పైనే పట్టే అవకాశం ఉందనేలా తాజాగా టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తుంది. ప్రస్తుతం పవన్ కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’, ‘వినోదయ సిత్తం’ చిత్రాలను కంప్లీట్ చేయడానికి మాత్రం సుముఖంగా ఉన్నట్లుగా టాక్. ‘హరిహర వీరమల్లు’కి సంబంధించి పవన్ కల్యాణ్‌కు సంబంధించిన మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తయినట్లుగా తెలుస్తుంది. త్వరలోనే ‘వినోదయ సిత్తం’ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. అక్టోబర్ మొదటి వీక్ లోపు ఈ చిత్రాన్ని కంప్లీట్ చేయాలనే ప్లానింగ్‌లో పవన్ ఉన్నాడని, ఆ తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చి.. పాలిటిక్స్‌పై పూర్తి స్థాయిలో ఆయన దృష్టి పెట్టేందుకు సిద్ధమవుతారని సమాచారం.
అయితే ‘భవదీయుడు భగత్‌సింగ్’ గ్యాప్ అనగానే.. అంతా ఆ చిత్రం ఆగిపోయిందని అనుకుంటారేమో కానీ.. ఎంత గ్యాప్ వచ్చినా సరే.. ఆ సినిమా ఖచ్చితంగా చేస్తానని పవన్ మాటివ్వడమే కాదు.. ఈ మధ్య ఆయనే స్వయంగా ఈ సినిమా ఉంటుందని ప్రస్తావించారు. కాబట్టి.. ఈ కాంబినేషన్‌లో సినిమా కోసం వేచి చూసేవారంతా డిజప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు.. కాస్త లేట్ అవ్వవచ్చేమో కానీ.. ఖచ్చితంగా ఈ కాంబినేషన్‌లో సినిమా మాత్రం పక్కా.