గత కొన్ని వారాలుగా విడుదలవుతున్న సినిమాలు అన్నీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో వరసగా విఫలం అవుతున్నాయి. విక్రమ్, మేజర్ చిత్రాల తర్వాత మళ్ళీ అంత బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న సినిమాలేవీ లేకపోవడంతో ప్రేక్షకులకు బోర్ కొట్టేస్తుంది. గత వారం విడుదలైన వారియర్ కూడా సత్తా చూపలేకపోయింది. రేపు విడుదల కాబోయే థాంక్యూ మూవీ పై ప్రేక్షకుల ఆసక్తి ఎలా వుందో చూద్దామని బుక్ మై షో ఓపెన్ చేసి చూస్తే ఒక్క థియేటర్ కూడా ఫుల్ అవ్వలేదు. టికెట్స్ తెగడం లేదు. అంటే థాంక్యూ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి, ఆత్రుత ఎంతగా ఉన్నాయో అర్ధమవుతుంది.
ఈ ఏడాది నాగ చైతన్య తండ్రి నాగార్జున తో కలిసి బంగార్రాజు తో బంపర్ హిట్ కొట్టాడు. సంక్రాంతికి రిలీజ్ అయిన ఆ సినిమా ఫ్యామిలీ హిట్ గా నిలిచింది. మనం సినిమాతో కలిసి పని చేసిన విక్రమ్ కుమార్ తో నాగ చైతన్య థాంక్యూ మూవీ చేసాడు. ఈ సినిమాకి విపరీతమైన ప్రమోషన్స్ చేసారు. చైతు ఇంటర్వూస్, థాంక్యూ ఈవెంట్స్ అంటూ హడావిడి చేసారు. కానీ ప్రేక్షకుల్లో థాంక్యూ మీద అసలు అంచనాలే లేవా అనిపించేలా బుక్ మై షో లో బుకింగ్స్ ఉన్నాయి. రేపు విడుదలవుతున్న ఈ సినిమాకి హిట్ టాక్ పడితే ఓకె.. లేదంటే నిర్మాత దిల్ రాజుకి బ్యాండ్ బాజానే.. అసలే హిందీలో రెండు సినిమాలు ప్లాప్ అయ్యి ఉన్నాయి. చూద్దాం ఈ వీకెండ్ లో థాంక్యూ మూవీ పరిస్థితి ఎలా ఉంటుందో అనేది.