సౌత్ సినిమాలు వెళ్లి అక్కడ హిందీలో దున్నేస్తుంటే బెంబేలెత్తిపోతున్న బాలీవుడ్ హీరోలు అండ్ అక్కడి మీడియా కూడా అక్కసుని వెళ్లగక్కుతున్నారు తప్ప తమ హిందీ చిత్రాలతో మాత్రం ఎటువంటి ప్రభావం చూపించలేకపోతున్నారు. ప్రేక్షకులని థియేటర్స్ కి రప్పించలేకపోతున్నారు. మన సినిమాల కలెక్షన్స్ లెక్కలు చూసి నోరెళ్లబెడుతున్న బాలీవుడ్ జనాలకి, వాళ్ళ సినిమాలను ప్రేక్షకులు ఎందుకు లెక్క చెయ్యడం లేదో అర్ధం కావడం లేదు. మొన్నటికి మొన్న అక్కడి స్టార్ అక్షయ్ కుమార్ నటించిన అత్యంత భారీ చిత్రం పృథ్వీ రాజ్ కపూర్ అత్యంత దారుణ పరాజయాన్ని మూటకట్టుకుంటే.. ప్రస్తుత క్రేజీ హీరో రణబీర్ కపూర్ బిగ్ బడ్జెట్ ఫిలిం శంషేరాకి కూడా భారీ స్థాయిలోనే భంగపాటు ఎదురైంది.
ఇక ఆచి తూచి అడుగులు వేస్తాడని, ఏరి కోరి సినిమాలు ఎంచుకుంటాడని మంచి పేరున్న అమీర్ ఖాన్ నాలుగేళ్లు కష్టపడి చేసి నానా తంటాలు పడుతూ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొని నేడు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన లాల్ సింగ్ చద్దా అక్కడా ఇక్కడా కూడా కనీసం నామమాత్రపు ప్రారంభ వసూళ్లు తెప్పించుకోలేక అనూహ్యరీతిలో చతికిల పడింది. అంతేకాదు ఈ చిత్రానికి మార్నింగ్ షోస్ నుండే మరీ నీరసంగా ఉంది అనే టాక్ రావడంతో ఇక బాక్సాఫీసు వద్ద చద్దా గారు పూర్తిగా పడుకున్నట్టే చెప్పాలి. సోషల్ మీడియాలో అయితే విపరీతమైం ట్రోలింగ్ నడుస్తుంది. బాయ్ కాట్ అమీర్ ఖాన్ అనే ప్రచారానికి తోడు ఇది లాల్ సింగ్ చద్దా కాదు బోర్ సింగ్ చద్దా అనే టాక్ రావడంతో బాలీవుడ్ మరో భారీ డిసాస్టర్ ని చూడాల్సి వస్తుంది.
అలాగే ఇదే రోజు అక్కడ విడుదలైన రక్షా బంధన్ ఓపెనింగ్స్, మౌత్ టాక్ కూడా అంతంత మాత్రంగానే ఉండడం గమనార్హం.