దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావుకి కోపం వచ్చింది. ఓ కమెడియన్ కమ్ హీరో అభిమానులు చేసిన అల్లరికి అసహనం వ్యక్తం చేస్తూ.. పబ్లిక్ ఫంక్షన్‌లో ఆయన ఫైర్ అయ్యారు. టాలీవుడ్‌కి అద్భుతమైన విజయాలను అందించి, దర్శకుడిగా ఎనలేని గుర్తింపును పొందిన కె. రాఘవేంద్రరావు.. ఈ మధ్య కాలంలో డైరెక్షన్ పక్కనెట్టి.. దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన దర్శకత్వ పర్యవేక్షణలో రూపుదిద్దుకున్న చిత్రం ‘వాంటెడ్ పండుగాడ్’. ఈ సినిమా ఈ శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. అయితే సినిమా ప్రచార కార్యక్రమాలలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ వేడుకలో.. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన జబర్ధస్త్ సుధీర్ అభిమానులు.. సుధీర్, సుధీర్ అంటూ కేకలు వేస్తూ.. వేదికపై మాట్లాడేవారి ప్రసంగాలకు అడ్డు పడటంతో.. దర్శకేంద్రుడు మైక్ తీసుకుని.. వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘చిన్నా, పెద్దా అనే తేడా లేదా.. పిచ్చి పిచ్చిగా ఉందా? ఇలా అయితే బయటికి పంపించేస్తా.. అసలెవరు పిలిచారు వీళ్లని’.. అంటూ రాఘవేంద్రరావు సీరియస్ అయ్యారు. అంతకుముందు అనసూయ వంటి వారు మాట్లాడుతున్నా కూడా.. సుధీర్ అభిమానులు అస్సలు తగ్గలేదు. సుధీర్ అంటూ అరుస్తూనే ఉన్నారు. దీంతో రాఘవేంద్రుడు క్లాస్ వేసుకోక తప్పలేదు. మాములుగా అయితే దర్శకేంద్రుడు ఎప్పుడూ కూల్‌గా కనిపిస్తూ ఉంటారు. పబ్లిక్ ఫంక్షన్స్‌లో కూడా ఆయన మాట్లాడేది చాలా తక్కువే. అలాంటిది.. ఆయన పర్యవేక్షణలో రూపుదిద్దుకున్న చిత్రం గురించి నాలుగు మాటలు చెప్పాలని ప్రయత్నించగా.. సుధీర్ అభిమానులంటూ కొందరు దానికి అడ్డుపడుతూ.. సుధీర్ మాట్లాడాలి అంటూ ఈలలు, కేకలు వేయడంతో ఆయనలో ఎప్పుడూ చూడని ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అందుకే గట్టిగా ఇచ్చిపడేశారు.