దర్శకుడు కృష్ణవంశీ - కథానాయిక రమ్యకృష్ణ దంపతులన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే అంతకు మించిన ఆసక్తికర అంశం మరొకటుంది. 1995లో వచ్చిన గులాబి మూవీ చూసి ఆ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన కృష్ణవంశీని ఎంతో అభినందించిన స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ స్నేహాన్నైతే కొనసాగించింది కానీ కృష్ణవంశీకి కాల్షీట్లు ఇచ్చింది మాత్రం మరో మూడేళ్ళ తరువాతే.!
1998లో నాగార్జున నటిస్తూ నిర్మించిన చంద్రలేఖ చిత్రం కోసమై కృష్ణవంశీ దర్శకత్వంలో నటించింది రమ్య. 2005 లో వాళ్లిద్దరూ దంపతులవడం జరిగింది. విశేషం ఏమిటంటే.. వారిద్దరూ కలిసి పని చేసింది ఆ ఒక్క చిత్రానికే కావడం. దంపతులయ్యాక కూడా కృష్ణవంశీ ఎన్నో చిత్రాలు చేసినా.. రమ్యకృష్ణ రాజమాతగా అవతరించి కేరెక్టర్ ఆర్టిస్ట్ గా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నా.. మళ్ళీ కృష్ణవంశీ డైరెక్ట్ చేస్తున్న చిత్రాల్లో మాత్రం ఇప్పటివరకు నటించలేదు. కృష్ణవంశీ కూడా రమ్యకి తగ్గ పాత్ర నేను నా సినిమాల్లో సృష్టించలేకపోయాను..అంటూ నవ్వుతూ సమాధానమిచ్చేవారు. అయితే మళ్ళీ నటిగా రమ్యకృష్ణ-దర్శకుడిగా కృష్ణవంశీ సెట్ లో కలవడానికి 20 ఏళ్ళు పట్టింది. ఇన్నాళ్లు దంపతులుగా కొనసాగిన వీరిద్దరూ ఇప్పుడు దర్శకుడు-నటీమణిగా రంగమార్తాండ సెట్స్ లో సీన్స్ గురించి సీరియస్ గా డిస్కర్స్ చేసుకోవడం సెట్ లో ఉన్నవారందరిని అబ్బురపరిచింది. పై ఫోటో చూస్తున్నారుగా ఓ సీనియర్ యాక్ట్రెస్ కి ఓ సిన్సియర్ డైరెక్టర్ సీన్ ఎక్స్ ప్లయిన్ చేస్తున్నట్టుగా ఉంది. ఎంతైనా ఇద్దరికీ ప్రొఫెషనలిజం అంటే ఏమిటో తెలుసు కదా!
మరాఠి సూపర్ హిట్ నటసామ్రాట్ మూల కథని తీసుకుని దానికి తనదైన రంగులద్దుతూ రంగమార్తాండ చిత్రాన్ని రూపొందిస్తున్నారు కృష్ణ వంశీ. ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రని పోషిస్తున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ, శివాత్మిక రాజశేఖర్, అనసూయ, రాహుల్ సిప్లిగంజ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి గాత్రంతో వినిపించనున్న షాహెరీలు రంగమార్తాండకు మరో మేజర్ హైలెట్ అవ్వనున్నాయి.