శర్వానంద్‌కి ఈ మధ్యకాలంలో అస్సలు కలిసి రావడం లేదు. సినిమాల ఎంపికలో వైవిధ్యతను కనబరుస్తున్నా.. కొంతకాలంగా ఆయనకు హిట్టనేది అందని ద్రాక్షలానే మారింది. తన పాత్ర వరకు, తన నటన వరకు మంచి మార్కులైతే వేయించుకుంటున్నాడు కానీ.. సినిమా విషయంలో మాత్రం సక్సెస్ కొట్టలేకపోతున్నాడు. ఇప్పుడు మరోసారి ‘ఒకే ఒక జీవితం’ అంటూ వైవిధ్యభరిత చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా హిట్టవ్వాలంటే, శర్వానంద్ ఖాతాలో హిట్టు పడాలంటే.. ఈ రోజు థియేటర్లలోకి వచ్చిన ‘ఒకే ఒక జీవితం’.. సుమారు రూ. 15 కోట్ల వరకు రాబట్టాలి. బిజినెస్ పరంగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 14 కోట్ల మేరకు అమ్ముడైనట్లుగా తెలుస్తుంది. కాబట్టి.. రూ. 14 కోట్లు దాటి ఒక్క రూపాయి రాబట్టినా.. ఈ సినిమా హిట్టు కిందే లెక్క.
అయితే, ఇటీవల శర్వానంద్ నటించిన చిత్రాలు.. కనీసం రూ. 10 కోట్ల మార్క్‌ను కూడా చేరుకోలేక చతికిలపడ్డాయి. ఇప్పుడు రూ. 15 కోట్లంటే చాలా కష్టమే. అందులోనూ ఇప్పుడు వచ్చే సినిమాలు ప్రేక్షకులకు ఒక పట్టాన నచ్చడం లేదు. ప్రేక్షకులకు నచ్చాలంటే అద్భుతమైన కంటెంట్ ఉండాలి. సాదా సీదా కంటెంట్‌తో వస్తే.. ప్రేక్షకులకు తిప్పి కొడుతున్న రోజులివి. అయితే తాజాగా విడుదలైన ఈ చిత్రం పరవాలేదనే టాక్‌నే సొంతం చేసుకుంది. ఓవర్సీస్ పరంగా ఈ చిత్రానికి మంచి కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. టైమ్ మిషన్ కాన్సెప్ట్‌తో వచ్చిన ‘ఆదిత్య 369’, రీసెంట్‌గా వచ్చిన ‘బింబిసార’ సినిమాలు మంచి విజయాన్నే అందుకున్నాయి కాబట్టి.. ఈ సినిమాకు కూడా ఛాన్స్ అయితే లేకపోలేదు. కాకపోతే, ఈ సినిమాని ప్రేక్షకులలోకి తీసుకెళ్లడానికి యూనిట్ ఇంకాస్త శ్రమించాల్సి ఉంటుంది. అలాగే ఇదొక టైమ్ మిషన్ కాన్సెప్ట్ చిత్రమనేలా కూడా ప్రేక్షకులకు తెలిసేలా.. ప్రోమోలు కట్ చేయాలి. అప్పుడు కానీ.. ప్రేక్షకులు ఈ సినిమాపై దృష్టి పెట్టే అవకాశం ఉంది.. లేదంటే, శర్వా ఖాతాలో మరో పరాజయం తప్పదు.