ఎన్నడూ లేని విధంగా ప్రభాస్ సలార్- ప్రాజెక్ట్ K షూటింగ్స్ విషయంలో తొందర పడుతున్నారు. రెండు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ని చకచకా పూర్తి చేసే పనిలో ఉండగా.. ఆయన సర్జరీ వల్ల అది కొద్దిగా లేట్ అయ్యింది. అనుకోకుండా ప్రభాస్ పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణం రాజు అకాల మరణంతో ప్రభాస్ ప్రస్తుతం సినిమా షూటింగ్స్ అన్ని ఆపేసారు. ముగ్గురు ఆడపిల్లలున్న కృష్ణం రాజుకి కొడుకులుగా ప్రభాస్, ఆయన అన్న ప్రభోద్ లు ఉన్నారు. కృష్ణ రాజు అంత్యక్రియలు కూడా ప్రభాస్ అన్న ప్రభోద్ చేతుల మీదుగానే జరిగాయి. అయితే పెదనాన్న కృష్ణం రాజు మరణం తర్వాత ప్రభాస్ ఆ కుటుంబంతోనే ఉంటున్నారు.
ఎందుకంటే రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు ఇప్పటికి కృష్ణం రాజు ఇంటికి వచ్చి ఆయన కూతుర్లు, భార్య శ్యామలాదేవి, ప్రభాస్ లని పలకరించి వెళుతున్నారు. నేడు కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఆయనతో పాటుగా కిషన్ రెడ్డి, బిజెపి నేతలు కృష్ణం రాజు ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులని ప్రభాస్ ని పలుకరించారు. అలాగే హోమ్ మంత్రి అమిత్ షా కూడా ప్రభాస్ ని కలవడానికి హైదరాబాద్ కి రాబోతున్నారు. ఇలా ఎవరో ఒకరు వచ్చిపోవడంతో ప్రభాస్ అక్కడే ఉండి అందరిని చూసుకోవడంతో పాటుగా ఆయనకు జరగాల్సిన కార్యక్రమాలను ప్రభాస్ దగ్గరుండి చూసుకోవాలనే ఆలోచనతోనే ఆయన ఓ నెల పాటు సినిమా షూటింగ్స్ కి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది. కృష్ణం రాజుగారి ఇంటి దగ్గర పరిస్థితుల దృష్ట్యా ప్రభాస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు.