రెండు రోజులుగా కమెడియన్ అలీ పార్టీ మారబోతున్నాడంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఎవరు పుట్టించారో కానీ.. ఈ వార్త అలీని బాగా ఇబ్బందులకు గురిచేస్తోంది. తన సైడ్ నుండి ఎటువంటి ఆలోచనలు లేకపోయినా.. ఎవరిలా పుట్టించారో.. పుట్టిస్తున్నారో? అంటూ ఆయన కూడా ఆశ్చర్యపోతున్నారు. నటుడిగా బిజీగానే ఉన్న అలీ.. మరో వైపు వైఎస్ఆర్‌సీపీ పార్టీలో చేరి.. గత ఎన్నికలలో ఆ పార్టీ తరపున ప్రచారం కూడా చేశారు. అయితే పార్టీలో ఇప్పటి వరకు తనకు సరైన గుర్తింపు రాలేదని భావించిన అలీ.. తన స్నేహితుడు.. తననెంతో ఇష్టపడే పవన్ కల్యాణ్ స్టాపించిన జనసేన పార్టీలోకి వెళ్లేందుకు చూస్తున్నట్లుగా టాక్ వైరల్ అవుతున్న నేపథ్యంలో.. అలీ స్పందించి, వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు.
‘‘నేను పార్టీ మారుతున్నానని వస్తున్న వార్తలలో నిజం లేదు. అవన్నీ ఎవరో కావాలని పుట్టిస్తున్నారు. ప్రస్తుతం నేను వైసీపీలోనే ఉన్నాను.. పార్టీ మారలేదు, మారే ఆలోచన కూడా లేదు. ఇక పదవులు అంటారా. ఎవరికి ఏమి ఇవ్వాలో.. ఎప్పుడు ఇవ్వాలో సీఎం జగన్‌గారికి తెలుసు. వాటి గురించి నేనెప్పుడూ ఆలోచించలేదు. జగన్ సీఎం కావాలని కోరుకున్నాను.. అందుకోసం నా తరపున ఏం చేయాలో అది చేశాను. అంతే ఆ తర్వాత నేనేమీ ఆశించలేదు.. వస్తే కాదని అనేదీ లేదు. కాబట్టి.. నా గురించి రాసే ముందు.. ఒక్కసారి నా అభిప్రాయం ఏమిటనేది తెలుసుకుంటే మంచిది. ఇలాంటి వార్తలు పుట్టించే వారికి నేను చెప్పేది ఇదే. తెలుసుకుని రాయండి.. ఏది పడితే అది రాసి.. మీరు ఇబ్బంది పడవద్దు.. నన్ను ఇబ్బందులకు గురి చేయవద్దు..’’ అంటూ, వస్తున్న వార్తలపై అలీ వివరణ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.