చాలామంది హీరోల అభిమానులు హద్దులు దాటేసి ప్రవర్తిస్తుంటారు. కొంతమంది నోటికి పని చెబితే.. కొంతమంది చేతులకి పని చెబుతారు. అభిమాన హీరోల కోసం ప్రాణాలు కూడా ఇచ్చేసేంత అభిమానం ఉంటుంది కొందరిలో. మరికొంతమంది హీరోల అభిమానులు ఇతరులని ఇబ్బంది పెడుతుంటారు. సోషల్ మీడియాలో నిత్యం ఇలాంటివి వింటూనే ఉంటాం. ఈ రోజుపుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రభాస్ కి ఓ రేంజ్ లో ట్రీట్ ఇచ్చేందుకు ఆయన నటించిన బిల్లాని 4K లో రీ రిలీజ్ చేసారు. అది ఎన్నిసార్లు టీవీలో చూసేసినా.. 4K లో రిలీజ్ అనగానే అభిమానులకి పూనకలొచ్చేశాయి.
అదేఊపులో పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రభాస్ ఫాన్స్ హంగామా హద్దులు దాటేసింది. తాడేపల్లి గూడెం వెంకట్రామ థియేటర్‌లో బిల్లా 4K స్పెషల్ షోగా ప్రదర్శిస్తున్నారు. ప్రభాస్ అభిమానులు భారీగా థియేటర్‌కు చేరుకున్నారు. ప్రభాస్ అన్నా.. ప్రభాస్ అన్నా, బిల్లా.. బిల్లా అంటూ గోల గోల చేస్తూనే థియేటర్ లో బిల్లా యాక్షన్ సన్నివేశాలు రాగానే కొంతమంది ఫాన్స్ అతి చేస్తూ అక్కడ బాణాసంచా కాల్చడంతో దాంతో థియేటర్‌లో మంటలు చేలరేగాయి. అక్కడ కొన్ని సీట్లు కూడా పాక్షికంగా కాలిపోయాయి. థియేటర్‌లో పొగలు వ్యాప్తించడంతో.. ప్రేక్షకులకు అక్కడ ఏం జరుగుతుందో తెలియక ప్రాణ భయంతో థియేటర్ నుంచి బయటకు పరుగులు తీశారు.. తర్వాత మంటలు అదుపులోకి రావడంతో ప్రేక్షకులు ఊపిరి పీల్చుకున్నారు.