అందుకే బాలీవుడ్ సినిమాలు ఆడట్లేదు.. ఈ మాట అంది ఎవరో కాదు.. ఈ మధ్య వచ్చిన ‘కాంతార’ చిత్రంతో ‘డివైన్ బ్లాక్‌బస్టర్’ అందుకున్న హీరో, దర్శకుడు రిషభ్ శెట్టి. ఆయన నటించి, దర్శకత్వం వహించిన ‘కాంతార’ చిత్రం కన్నడలోనే కాకుండా.. తెలుగు, హిందీ భాషలలో కూడా విడుదలైన విషయం తెలిసిందే. విడుదలైన ప్రతి చోటా ఈ చిత్రం రూ. 50 కోట్లకు పైగా కలెక్షన్స్‌ను రాబట్టింది. అలాగే ఓవర్సీస్‌లో కూడా ఈ చిత్రం భారీ సక్సెస్ అందుకుంది. మొన్నటి వరకు ఈ సినిమా పేరొక ప్రభంజనంగా వైరల్ అయింది. ఇప్పటికీ ఈ సినిమా మంచి కలెక్షన్స్‌ను రాబడుతుండటం విశేషం. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రిషభ్ శెట్టి.. బాలీవుడ్‌పై పరోక్షంగా చేసిన కొన్ని కామెంట్స్.. ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్‌లో సినిమాలు సక్సెస్ కాకపోవడానికి కారణం ఇదే.. అనేలా ఆయన ఇచ్చిన జ్ఞానోపదేశంతో.. ఎంత మంది మేకర్స్‌లో మార్పు వస్తుందో తెలియదు కానీ.. రిషభ్ మాటలు మాత్రం వారికి గుచ్చుకునేలా ఉన్నాయనేది మాత్రం సత్యం.
ఇంతకీ రిషభ్ శెట్టి ఏమన్నాడంటే.. ‘‘మేము మా కోసం సినిమాలు చేయం. ప్రేక్షకులు ఏ కంటెంట్‌ని చూడటానికి ఇష్టపడుతున్నారో గమనించి.. వారికి కావాల్సిన కంటెంట్‌తో సినిమాలు చేస్తాం. మేము సినిమాలలోకి రాకముందు జనాల్లో తిరిగి.. ప్రజల జీవన విధానం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మేకర్స్ ఎక్కువగా హాలీవుడ్ కంటెంట్‌పై దృష్టి పెడుతున్నారు. టెక్నాలజీపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. పాశ్చాత్య పోకడలు బాగా ఎక్కువయ్యాయి. దీంతో ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారో తెలుసుకోలేకపోతున్నారు. కంటెంట్ చూసుకోకుండా.. కోట్లు కుమ్మరిస్తే ఏం ఉపయోగం ఉంటుంది. మన ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారో తెలుసుకోగలిగితే.. ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది’’ అని రిషభ్ పరోక్షంగా బాలీవుడ్‌పై విమర్శలు గుప్పించాడు.