పవర్ స్టార్ పవన్ కల్యాణ్, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కాల్సిన ‘భవదీయుడు భగత్‌సింగ్’ చిత్రం ఆగిపోయినట్లుగా.. గత కొన్ని రోజులుగా టాలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి. మధ్యలో హరీష్ శంకర్ కలగజేసుకుని అలాంటిదేమీ లేదని, సమయం వచ్చినప్పుడు అప్‌డేట్ వస్తుందని క్లారిటీ ఇచ్చాడు కానీ.. ఆంధ్రప్రదేశ్‌లో మారిపోతున్న రాజకీయ సమీకరణాలతో... ఈ సినిమాపై మరింతగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాలిటిక్స్ పరంగా ఏపీలోనే ఉండాల్సిన ఆవశ్యకత రోజురోజుకూ పెరుగుతుండటంతో.. సినిమాల పరంగా పవన్ కల్యాణ్ బ్రేక్ ఇవ్వాల్సిన పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో.. ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న ‘హరిహర వీరమల్లు’ చిత్రం పూర్తవడం కూడా గగనమే అనేలా ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. దీంతో హరీష్‌తో చేయాల్సిన ‘భవదీయుడు భగత్‌సింగ్’ సినిమాని పవన్ కల్యాణ్ కూడా వద్దని అనుకుంటున్నట్లుగా టాక్. పవన్ కల్యాణ్ ఈ సినిమా చేయని క్రమంలో.. మెగాస్టార్‌తో ఈ సినిమాని చేయాల్సిందిగా హరీష్‌ను మెగా ఫ్యాన్స్ కోరుతుండటం విశేషం.
‘భవదీయుడు భగత్‌సింగ్’పై వస్తున్న వార్తలతో కొందరు మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా.. హరీష్ శంకర్‌కు రిక్వెస్ట్‌లు పెడుతున్నారు. బాస్‌కి ఆ టైటిల్‌తో సినిమా చేయాలని ఎప్పటి నుండో కోరిక ఉంది. ఆ స్ర్కిఫ్ట్‌ని మెగాస్టార్‌కి అనుగుణంగా మార్చి.. వీలైనంత త్వరగా సెట్స్‌పైకి తీసుకెళ్లమంటూ హరీష్‌కి వారు సూచనలు చేస్తున్నారు. ‘ఆచార్య’ ప్రమోషన్స్ టైమ్‌లో హరీష్‌కి చిరంజీవి కూడా మాటిచ్చారు. మంచి కథతో వస్తే.. తప్పకుండా సినిమా చేద్దామని చెప్పారు. పవన్‌తో చేయాలనుకున్న ‘భవదీయుడు భగత్‌సింగ్’కు సంబంధించి ఓ సీన్ కూడా తనని ఎంతగానో ఆకర్షించినట్లుగా చిరు తెలిపారు. ఆ సీన్‌కి సంబంధించిన డైలాగ్స్ కూడా ఆయన లీక్ చేశారు. అద్భుతం అంటూ హరీష్‌ని కొనియాడారు కూడా. మరి ఆ సీన్‌లో తనే అంటే.. బాస్ కూడా కాదనడు కాబట్టి.. నిజంగా పవన్ ఆ ప్రాజెక్ట్ చేయకపోతే.. మెగాస్టార్ చిరంజీవితో హరీష్ శంకర్‌కు లైన్ క్లియర్ అయినట్లే భావించవచ్చు. చూద్దాం.. ముందు ముందు ఏం జరగబోతోందో?