సూపర్ స్టార్ కృష్ణ గారు అస్వస్థతో హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చేరిన విషయం తెలుసుకున్న సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులు కంగారు పడుతున్నారు. నిన్న ఆదివారం కార్డియాక్ అరెస్ట్ తో అపస్మారక స్థితిలో ఉన్న ఆయనని మహేష్ బాబు భార్య నమ్రత ఆసుపత్రికి తీసుకు రాగా.. వైద్యులు ఆయనని ICU లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ ఏడాది పెద్ద కొడుకు రమేష్ బాబు, అలాగే మొన్నీమధ్యనే భార్య ఇందిరా దేవి మరణంతో కుంగిపోయిన కృష్ణగారు ఇలా అనారోగ్యం పాలైనట్లుగా తెలుస్తుంది.
అయితే కృష్ణగారి ఆరోగ్యం నిలకడగా ఉంది అని, ప్రస్తుతం కృష్ణగారికి జనరల్ హెల్త్ చెకప్ చేస్తున్నారని, ఆయనకి ఎటువంటి ప్రమాదం లేదని, మరో రెండు రోజులపాటు ఆయనని ఆసుపత్రిలో ఉంచి ట్రీట్మెంట్ ఇస్తారని పీఆర్ టీం అప్ డేట్ ఇచ్చారు. కానీ కృష్ణగారు కార్డియాక్ అరెస్ట్ తో ఆసుపత్రిలో చేరారు అని, ప్రస్తుతం ఆయన హెల్త్ విషయంలో ఏం చెప్పలేమని, ఆయన క్రిటికల్ స్టేజ్, సీరియస్ కండిషన్ లో వెంటిలేటర్ పై ఉన్నట్లుగా కాంటినెంటల్ వైద్యులు ప్రెస్ మీట్ పెట్టి హెల్త్ బులిటెన్ విడుదల చేసారు.
ప్రస్తుతం కృష్ణ గారిని ఇంటెన్సివ్ కేర్ లో ఉంచి ట్రీట్మెంట్ ఇస్తున్నట్లుగా, ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లుగా వైద్యులు చెప్పడంతో ఘట్టమనేని అభిమానుల్లో ఆందోళన అంతకంతకు పెరిగిపోతుంది. ఇక వైద్యులు ఆయనకి బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్తున్నామని, ఇంకో 24 గంటలపాటు ఆయన హెల్త్ విషయంలో ఏం చెప్పలేమంటూ ప్రకటించారు. ప్రస్తుతం కృష్ణ గారి వెంట ఆయన కుటుంబ సభ్యులు ఉన్నారు.