నిన్న మంగళవారం సూపర్ స్టార్ కృష్ణ గారి మరణంతో టాలీవుడ్ మూగబోయింది. నానక్ రామ్ గూడాలోని కృష్ణ గారి పార్థీవ దేహాన్ని ఉంచిన విజయ కృష్ణ నివాసానికి ప్రముఖులు బారులు తీరారు. మెగాస్టార్ చిరంజీవి నుండి జూనియర్ ఎన్టీఆర్ వరకు చిన్న పెద్ద హీరోలంతా కృష్ణగారికి నివాళులర్పించారు. అలాగే మహేష్ కి ధైర్యం చెప్పారు. సాయంత్రానికి ప్రభాస్, అఖిల్ లాంటి హీరోలు మహేష్ ని పలకరించి వెళ్లారు. సాయంత్రం తర్వాత అభిమానుల సందర్శనార్ధం కృష్ణ గారి భౌతిక కాయాన్ని గచ్చిబౌలి స్టేడియం కి తరలిస్తారని అన్నప్పటికీ.. రాత్రి కూడా కృష్ణ గారి నివాసంలోనే కృష్ణగారి భౌతిక కాయాన్ని ఉంచి ఈ రోజు ఉదయం ఆయన్ని పద్మాలయ స్టూడియో కి తీసుకువచ్చారు.
అక్కడికి కృష్ణగారి అభిమానులు వేలాదిగా చేరుకొని నివాళు అర్పిస్తూ కడసారి చూపులు చూసుకుంటున్నారు. అయితే నిన్న మంగళవారం వేరే చోట వీర సింహ రెడ్డి షూటింగ్ లో ఉన్న బాలకృష్ణ కృష్ణ చివరికి చూపు కోసం రాలేకపోయారు.
ఈ రోజు కృష్ణగారి వేలాది మంది అభిమానుల మధ్యన బాలకృష్ణ తన భార్య, కూతుళ్లతో వచ్చి కృష్ణగారికి నివాళులర్పించి మీడియాతో మట్లాడారు. మహేష్ బాబు కి ధైర్యం చెప్పి అక్కడే కొద్దిసేపు ఉండి.. మీడియాతో మట్లాడుతూ కృష్ణగారు-ఎన్టీఆర్ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కృష్ణగారికి ప్రగాఢ సానుభూతిని, కృష్ణ కుటుంబానికి సంతాపాన్ని తెలియజేసారు. బాలయ్య తో ఆయన భార్య వసుంధర, పెద్ద కూతురు బ్రాహ్మణి కూడా ఉన్నారు.