‘NTRforSDT’ అంటూ రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఓ ట్యాగ్ టాప్‌లో ట్రెండ్ అవుతున్న విషయం తెలిసిందే. సాయిధరమ్ తేజ్ 15వ చిత్రానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వడంతో.. దీనిపై ఒకవైపు ఆసక్తి, మరోవైపు మెగా ఫ్యాన్స్ రచ్చ కలిపి.. ఈ ట్యాగ్ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. తాజాగా ఈ SDT15 సినిమాకు సంబంధించిన టైటిల్, అలాగే ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చిన ఫస్ట్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ గ్లింప్స్ చూస్తుంటే.. యంగ్ టైగర్ వాయిస్ ఓవర్ ఎందుకు తీసుకున్నారనేది.. అందరికీ క్లారిటీ వచ్చేస్తుంది. ఆ గ్లింప్స్‌కి అంత పవర్ ఫుల్ వాయిస్ అవసరం కాబట్టే.. చిత్రయూనిట్ ఎన్టీఆర్‌ని సంప్రదించారు. ఇంతకు ముందు సాయిధరమ్ తేజ్ సినిమా ఓపెనింగ్‌కి ఎన్టీఆర్ వచ్చి క్లాప్ కొట్టారు. ఇప్పుడీ సినిమాకు వాయిస్ ఓవర్ ఇవ్వడంతో.. మెగా,నందమూరి బాండింగ్ ఎలా ఉంటుందో.. ఫ్యాన్స్‌కి మరోసారి వీరు తెలియజేశారు.
ఇక ఈ గ్లింప్స్‌లో.. ‘‘అజ్ఞానం భయానికి మూలం. భయం, మూఢనమ్మకానికి కారణం. ఆ నమ్మకమే నిజమైనప్పుడు.. ఆ నిజం, జ్ఞానానికి అంతుచిక్కనప్పుడు.. అసలు నిజాన్ని చూపించే మరో నేత్రం’’ అంటూ ఎన్టీఆర్ వాయిస్‌లో వచ్చిన పవర్ ఫుల్ డైలాగ్ అనంతరం టైటిల్ ‘విరూపాక్ష’ని రివీల్ చేశారు. ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు, సాయిధరమ్ తేజ్ ఎంట్రీ.. ఇలా మొత్తంగా ఈ గ్లింప్స్ అదుర్స్ అనిపించేలా ఉంది. మరో విషయం ఏమిటంటే.. ప్రస్తుతం పవన్ కల్యాణ్ చేస్తున్న ‘హరిహర వీరమల్లు’ చిత్రానికి మొదటిగా టైటిల్ ‘విరూపాక్ష’ అనే అనుకున్నారు. ఇప్పుడదే టైటిల్‌తో ఆయన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ సినిమా చేస్తుండటంతో.. మెగా ఫ్యాన్స్ అంతా హ్యాపీగా ఉన్నారు. అలాగే గ్లింప్స్ ప్రకారం చూస్తే.. సినిమాలో కంటెంట్ ఓ రేంజ్‌లో ఉండబోతుందనేది కూడా అర్థమవుతుంది. అందుకే పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై కార్తీక్ దండు దర్శకత్వంలో బివిఎస్‌ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2023లో ఏప్రిల్ 21న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లుగా గ్లింప్స్‌లో అధికారికంగా మేకర్స్ ప్రకటించారు.