‘కాంతార’ సినిమాపై దర్శకధీరుడు, జక్కన్న ఎస్ ఎస్ రాజమౌళి సంచలన కామెంట్స్ చేశారు. ఆ సినిమాతో ఎన్నో పాఠాలు నేర్చుకున్నానని, తనని తాను మరోసారి సమీక్షించుకునేలా ‘కాంతార’ చిత్రం చేసిందని రాజమౌళి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే.. రాజమౌళికి ఇది సమీక్షించుకునే స్థితి అయితే కాదు.. సంకట స్థితి అని చెప్పుకోవాలి. ఎందుకంటే.. ఆయన సినిమాలకు బడ్జెట్ ఏ రేంజ్‌లో పెరిగిపోతుందో తెలియంది కాదు. ఒకదానిని మించి ఒకటి అన్నట్లుగా బడ్జెట్ పెరిగిపోతుంది. ఆఫ్‌కోర్స్.. అదే రేంజ్‌లో కలెక్షన్స్ వస్తున్నాయనుకోండి. కానీ ‘కాంతార’ చిత్రంతో పోల్చుకుంటే.. రాజమౌళి చిత్రాల విజయం.. అసలు విజయమే కాదని చెప్పుకోవచ్చు. అదే విషయం రాజమౌళి కూడా చెప్పుకొచ్చాడు.
‘కాంతార’ చిత్రం అతి తక్కువ బడ్జెట్ అంటే.. రూ. 15 కోట్ల కంటే కూడా తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కింది. స్టార్ క్యాస్ట్ కూడా లేరు.. అలాంటి సినిమా ‘ఆర్ఆర్ఆర్’, ‘కెజియఫ్ 2’ తరహాలో వసూళ్లని సాధించి ఔరా అని అంతా ఆశ్చర్యపోయేలా చేసింది. పాన్ ఇండియా స్థాయిలో.. విడుదలైన ప్రతి చోటా సంచలన విజయాన్ని ఈ చిత్రం అందుకుంది. ‘కాంతార’ సాధించిన విజయంతో.. ఆ సినిమాపై ప్రతి ఒక్కరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా రాజమౌళి ఈ సినిమాపై రియాక్ట్ అయ్యారు. ఇలాంటి సినిమాల రిజల్ట్ చూసినప్పుడు వణుకు వచ్చేస్తుంది. ఈ సినిమా తర్వాత నా ఆలోచనా విధానాన్ని ఒక్కసారి సమీక్షించుకోవాలనిపించింది. పాన్ ఇండియా స్థాయిలో హిట్టు కొట్టాలంటే భారీతనం అవసరం లేదని ‘కాంతార’ నిరూపించింది. ఇకపై బడ్జెట్ విషయంలో.. నేను కూడా పక్కాగా ఆలోచన చేయాలనే నిర్ణయాన్ని నాలో కల్పించింది. బడ్జెట్ చిత్రాలతో ‘కాంతార’ను పోల్చలేం కానీ.. ఆ సినిమా చాలా ప్రత్యేకమైనది. మాలాంటి వారందరికీ ఎన్నో పాఠాలు నేర్పిందని రాజమౌళి అన్నారంటే.. ‘కాంతార’ విజయం ఎందరిలో మార్పుకు కారణమైందో అర్థం చేసుకోవచ్చు.