సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ గారు ఈ రోజు శుక్రవారం తెల్లవారుఝామున అనారోగ్యంతో ఆయన నివాసంలోనే కన్ను మూసారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో ఆసుపత్రిలో వైద్యం చేయించుకుని ఈ మధ్యనే ఇంటికి వచ్చిన సత్యనారాయణ గారు ఫిలిం నగర్ నివాసంలో తుది శ్వాస విడిచారు. కైకాల మరణంతో దిగ్బ్రాంతికి లోనైనట్లుగా బాలకృష్ణ ట్వీట్ చేసారు. కైకాల సత్యనారాయణ గారు ఆరు దశాబ్దాలు పాటు తెలుగు సినిమా రంగంలో పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రల్లో నవరస నటనా సార్వభౌముడిగా తన వైవిధ్యమైన నటనతో అలరించారు.
మా కుటుంబంతో కైకాల సత్యనారాయణ గారికి స్నేహ సంబంధాలు వున్నాయి. నాన్నగారితో కలిసి ఎన్నో సినిమాల కోసం పనిచేశారు. నా చిత్రాల్లో కూడా మంచి పాత్రలు పోషించారు. మంచి నటుడిగానే కాకుండా పార్లమెంట్ సభ్యునిగా తనదైన ముద్రవేశారు. సినీ జీవితంలోనూ, ప్రజాజీవితంలోనూ ఎంతో బాధ్యతాయుతంగా ఆయన అందించిన సేవలు మరువలేనివి. ఈ రోజు ఆయన మన మధ్య లేకపోవడం ఎంతో దురదృష్టకరం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను
-నందమూరి బాలకృష్ణ