Advertisementt

కైకాల స్వచ్ఛమైన స్ఫటికం: చిరంజీవి

Tue 03rd Jan 2023 11:26 AM
kaikala satyanarayana,chiranjeevi,surekha,chiranjeevi on kaikala,kaikala satyanarayana no more  కైకాల స్వచ్ఛమైన స్ఫటికం: చిరంజీవి
Chiranjeevi pays tribute to Kaikala Satyanarayana కైకాల స్వచ్ఛమైన స్ఫటికం: చిరంజీవి
Advertisement
Ads by CJ

కైకాల సత్యన్నారాయణ స్వచ్ఛమైన స్ఫటికం లాంటి మనిషి.. నిష్కల్మషమైన మనసున్న మనిషి.. ఎటువంటి అరమరికలు లేకుండా ఉన్నది ఉన్నట్లు మాట్లాడే స్వభావం కలవారని అన్నారు చిరంజీవి. ట్విట్టర్ వేదికగా కైకాలతో తనకున్న అనుబంధాన్ని షేర్ చేసుకున్న ఆయన.. కైకాలకు ఆత్మ శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. నివాళులు అర్పించారు.

‘‘తెలుగు సినీ కళామతల్లి ముద్దుబిడ్డ, నవరస నటనా సార్వభౌముడు శ్రీ కైకాల సత్యన్నారాయణగారు మృతి చెందడం నన్ను కలచివేస్తోంది. శ్రీ కైకాల సత్యన్నారాయణగారు తెలుగు సినీ రంగానికే కాదు.. భారత సినీ రంగానికి గర్వకారణమైన అత్యంత ప్రతిభావంతుడైన నటులు. శ్రీ సత్యన్నారాయణగారు పోషించినటువంటి వైవిధ్యమైన పాత్రలు బహుశా.. భారతదేశంలో వేరొక నటుడు పోషించి ఉండరు. 

శ్రీ కైకాల సత్యన్నారాయణగారితో కలిసి నేను ఎన్నో చిత్రాల్లో నటించాను. ఆ సందర్భంగా ఆయన నటనా వైదుష్యాన్ని, వ్యక్తిత్వాన్ని దగ్గర నుండి పరిశీలించే అవకాశం నాకు కలిగింది. గొప్ప స్పాంటేనియిటీ ఉన్న అరుదైన నటులు ఆయన. డైలాగ్ డెలివరీలో ఆయనది ప్రత్యేక పంథా. స్వచ్ఛమైన స్ఫటికం లాంటి మనిషి. నిష్కల్మషమైన మనసున్న మనిషి. ఎటువంటి అరమరికలు లేకుండా ఉన్నది ఉన్నట్లు మాట్లాడే స్వభావం కలవారు. నన్ను ‘తమ్ముడూ’ అంటూ తోడబుట్టినవాడిలా ఆదరించారు. మా మధ్య అనుబంధం, ఆత్మీయత అంతకంతకూ బలపడుతూ వచ్చాయి. ఆయనతో నాకు ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి. ఆనందకరమైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. 

నటన, రుచికరమైన భోజనం రెండూ శ్రీ కైకాల సత్యన్నారాయణగారికి ప్రాణం. నా శ్రీమతి సురేఖ చేతివంటను ఎంతో ఇష్టపడేవారు. క్రిందటేడాది, ఈ యేడాది ఆయన జన్మదినం సందర్భంగా ఆయన స్వగృహానికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేయడం నాకు మిగిలిన సంతృప్తి. ఆ సందర్భంగా సత్యన్నారాయణగారు సురేఖతో ‘‘అమ్మా ఉప్పు చేప వండి పంపించు’’ అని అన్నప్పుడు ‘‘మీరు త్వరగా కోలుకోండి.. ఉప్పు చేపతో మంచి భోజనం చేద్దాం’’ అని అన్నాము. ఆ క్షణాన ఆయన చిన్నపిల్లాడిలా ఎంతో సంతోషపడిపోయారు. 

శ్రీ కైకాల సత్యన్నారాయణగారు గొప్ప సినీ సంపదను అందరికీ అందించి వెళ్లిపోయారు. ఆయనకు ఆత్మ శాంతి కలగాలని భగవంతుణ్ణి కోరుకుంటూ.. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తున్నాను’’ అని చిరంజీవి తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

Chiranjeevi pays tribute to Kaikala Satyanarayana:

Chiranjeevi Tweet on Kaikala Satyanarayana

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ