లెజండరీ నటుడు కైకాల సత్యనారాయణ మృతి మరువక ముందే టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. దాదాపు కైకాల స్థాయి నటుడే అయిన చలపతిరావు (78) హఠాన్మరణం పాలైయ్యారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆదివారం ఉదయం గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. దీంతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యే కాలనీ, బంజారాహిల్స్‌లో తన కుమారుడు రవిబాబు ఇంట్లో ఉంటున్నారు. ఆయన కుమార్తె అమెరికా నుంచి వచ్చిన తర్వాత అంత్యక్రియలు నిర్వహించనున్నారు. బుధవారం రోజున మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం వరకు ఆయన భౌతిక కాయాన్ని.. కుమారుడు రవిబాబు ఇంట్లోనే అభిమానుల సందర్శనార్థం ఉంచి.. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆయన పార్థివ దేహాన్ని ఫిల్మ్‌నగర్ మహాప్రస్థానం ఫ్రీజర్‌లో ఉంచడం జరుగుతుందని చలపతిరావు తనయుడు రవిబాబు తెలిపారు. చలపతిరావు మరణ వార్త తెలిసిన సినీ, రాజకీయ ప్రముఖులు.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ.. ఫ్యామిలీ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నారు.
1944 మే 8న కృష్ణాజిల్లా బల్లిపర్రు గ్రామంలో చలపతిరావు జన్మించారు. దాదాపు 1200కి పైగా చిత్రాలలో నటించిన చలపతిరావు.. విలన్‌గా సరికొత్త విలనీని టాలీవుడ్‌కి పరిచయం చేశారు. అప్పట్లో సినిమాలలో రేపుల స్పెషలిస్ట్ అనే పేరు కూడా ఆయనకు ఉంది. క్రూరమైన విలన్‌గా కనిపించాలంటే ఆయన తర్వాతే ఎవరైనా. క్రూరమైన విలన్‌గానే కాదు, కామెడీ విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు చిత్రాలలో ఆయన గుర్తుండిపోయే పాత్రలు చేశారు. నాటి ఎన్టీఆర్ తరం నుంచి.. నేటి ఎన్టీఆర్ తరం వరకు దాదాపు అందరి హీరోల చిత్రాలలో ఆయన నటించారు. ‘ఆది’, ‘చెన్నకేశవరెడ్డి’ చిత్రాలలో ఆయన పోషించిన పాత్రలతో అందరికీ ఆయన ‘చలపతి బాబాయ్’గా మారిపోయారు. నందమూరి తారక రామారావు అంటే ఆయనకి ఎంతో ఇష్టం. తనని ఆయన ఎంతగానో ప్రోత్సహించారని పలు ఇంటర్వ్యూలలో ఆయన చెప్పారు. ‘గూఢచారి 116’ చిత్రంతో నటుడిగా ఆయన సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. నటుడిగానే కాకుండా.. ‘కలియుగ కృష్ణుడు’, ‘కడప రెడ్డమ్మ’ వంటి చిత్రాలను ఆయన నిర్మించారు. చివరిగా ఆయన కనిపించిన చిత్రం ‘బంగార్రాజు’. ఆ తర్వాత ఆయన వెండితెరపై కనిపించలేదు. ఇప్పుడు సడెన్‌గా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. చలపతిరావు ఆత్మకు శాంతి చేకూరాలని సినీజోష్ ప్రార్థిస్తోంది.