ఒక దేశాన్ని లీడ్ చేసే వ్యక్తి అంటే ఎలా ఉంటుంది. ఆయన ఒక చిటికేస్తే చాలు ఆయనకి కావాల్సినవన్నీ నిమిషాల్లో అరేంజ్ అవుతాయి. ఆయన ఏం చెప్పినా అదే శాసనం, చేతినిండా అధికారాలు, ఇంటి నిండా నౌకర్లు, చుట్టుపక్కల సెక్యూరిటీ. కాలు కిందపెడితే ఆయనకి సేవ చేసేందుకు క్యూ లైన్ లో ఉండే పనివాళ్ళు. అది దేశ ప్రధానికి ఉండే ప్రత్యేకత. ఎంత దేశానికి రాజైనా ఒక తల్లికి తాను కొడుకునే అని నిరూపించారు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ. ఆయన తల్లి హీరాబెన్ ఈరోజు శుక్రవారం తెల్లవారుఝామున 3:30 నిమిషాలకి స్వర్గస్తులయ్యారు.
తల్లి మరణం గురించి తెలిసిన ప్రధాని నరేంద్ర మోదీ భావోద్వేగానికి గురయ్యారు. అమ్మను చూస్తే.. త్రిమూర్తును చూసినట్టు ఉండేదని అన్నారు. బుద్ధితో పనిచేయాలి, శుద్ధిగా పనిచేయాలి అని తన తల్లి చెప్పిన మాటలను.. ఎప్పటికీ గుర్తుంచుకుంటానని ట్వీట్ చేశారు. వందేళ్ల జీవించిన అమ్మ ఇప్పుడు ఈశ్వరుడి పాదాల చెంతకు వెళ్లిపోయింది. అమ్మలో నేను త్రిమూర్తులను చూశాను. ఆమె నిస్వార్థ కర్మయోగి. సన్యాసి జీవితాన్ని అనుభవించారు. విలువలకు కట్టుబడి జీవించారు అని అన్నారు. మోడీ తల్లికి జరగాల్సిన అన్ని కార్యక్రమాలు దగ్గరుండి నిర్వహించారు.
తల్లి ఆసుపత్రిలో చేరినప్పుడే తల్లిని పరామర్శించిన మోడీ ఆమె మరణం తర్వాత తల్లి పార్థీవ దేహం పక్కనే ఉన్నారు. హీరాబెన్ పాడే మోసిన మోడీ, ఆమె అంతిమయాత్ర వాహనంలో ఎక్కి కూర్చుని ఆమెకి దహన సంస్కారాలను దగ్గరుండి నిర్వహించారు. తల్లి చితికి నిప్పు పెడుతూ హీరాబెన్ పెద్ద కుమారుడు సోమ్‌భాయ్ భావోద్వేగానికి గురయ్యారు. ఆయన కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆయన్ని నరేంద్ర మోదీ ఓదార్చారు. ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ అంత్యక్రియలు ముగిశాయి. ముందుగా పెద్ద కుమారుడు సోమ్భాయ్ చితి వెలిగించారు, తరువాత ప్రధాని మోడీ, ఇతర సోదరులు కూడా తల్లి మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి చేశారు.