ఈ సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఐదు సినిమాలు సందడి చేయబోతోన్న విషయం తెలిసిందే. ముందుగా అజిత్ ‘తుణివు’ చిత్రం జనవరి 11న విడుదలవుతుండగా.. జనవరి 12న నందమూరి నటసింహం బాలయ్య నటించిన ‘వీరసింహారెడ్డి’ దిగుతోంది. ఆ మరుసటి రోజు అంటే జనవరి 13న మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ విడుదల కానుంది. ఆ తర్వాత రోజు అంటే జనవరి 14న తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘వారసుడు’, సంతోష్ శోభన్ ‘కళ్యాణం కమనీయం’ చిత్రాలు విడుదల కానున్నాయి. వాస్తవానికి జనవరి 11నే ‘వారసుడు’ చిత్రం విడుదల కావాలి. తమిళ్‌లో ఇదే చిత్రం ‘వారిసు’గా జనవరి 11నే విడుదల అవుతుండగా.. తెలుగులో మాత్రం జనవరి 14న విడుదల చేయనున్నారు. అందుకు కారణాలు దిల్ రాజు ఆల్రెడీ మీడియా సమావేశం నిర్వహించి మరీ చెప్పిన విషయం తెలిసిందే.
ఇక సంక్రాంతి బరిలో దిగుతోన్న ఈ ఐదు చిత్రాలు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని.. విడుదలకు సిద్ధమయ్యాయి. ఈ ఐదు చిత్రాలలో రెండు చిత్రాలు సెన్సార్ నుండి క్లీన్ ‘యు’ సర్టిఫికేట్‌ను సొంతం చేసుకున్నాయి. ‘కళ్యాణం కమనీయం’ చిత్రం క్లీన్ యు పొందగా.. తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న విజయ్ ‘వారసుడు’ చిత్రం కూడా క్లీన్ యు సర్టిపికేట్‌ను సొంతం చేసుకుని.. పండగకి రాబోతోన్న క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా టాక్‌ని సొంతం చేసుకుంది.
దళపతి విజయ్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా పతాకాలపై నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి నిర్మించిన చిత్రం ‘వారసుడు’. విజయ్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం ఈ పండగకి వచ్చే పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులని అలరించబోతుంది. ఈ సినిమాను కుటుంబ సభ్యులందరితో కలిసి హాయిగా చూడవచ్చనేలా సెన్సార్ రిపోర్ట్ రావడంతో చిత్రయూనిట్ కూడా సినిమా విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.